మద్రాస్ హైకోర్టు.. తల్లిబిడ్డల ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: తండ్రి లేకుండా బిడ్డ..? మద్రాస్ హైకోర్టు చొరవతో టెక్నికల్‌గా ఇది సాధ్యమయ్యింది. తమిళనాడులో వీర్య దాత ద్వారా బిడ్డను కన్న ఓ తల్లి.. బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరును తొలగించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దీంతో చిన్నారి తావిషి పెరారా దేశంలో ‘తండ్రి లేని బిడ్డగా’ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే...
త్రిచీకి చెందిన మధుమిత రమేష్ అనే మహిళ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారం మేర విడిపోయారు. ఆపై కొన్నిరోజుల తర్వాత వీర్యం డోనర్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో మధుమిత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే త్రిచీ కార్పొరేషన్ అధికారులు మాత్రం బిడ్డ తండ్రిగా వీర్యదాత మనిష్ మదన్‌పాల్ మీనా పేరును బర్త్ సర్టిఫికేట్‌లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధుమిత.. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాల్సిందిగా అధికారులకు అర్జి పెట్టుకుంది. పేర్లలో తప్పులను మాత్రమే సవరించే వీలుందని, అంతేగానీ ఏకంగా పేరునే తొలగించే అవకాశం లేదని అధికారులు ఆమెకు బదులిచ్చారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి తిరస్కరించటంతో మరోసారి ఆమె కోర్టు తలుపు తట్టారు. అదే సమయంలో ఆమె మాజీ భర్త చరణ్ రాజ్, వీర్యపు డోనర్ మనీష్‌లు ఇద్దరూ ఆ బిడ్డకు తాము తండ్రులం కాదంటూ అఫిడవిట్‌లు దాఖలు విశేషం. చివరకు మధుమిత అభ్యర్థనను అంగీకరించిన బెంచ్.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని త్రిచీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తద్వారా తావిషి తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లో నిలిచిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment