without father name
-
తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లోకి...
సాక్షి, చెన్నై: తండ్రి లేకుండా బిడ్డ..? మద్రాస్ హైకోర్టు చొరవతో టెక్నికల్‌గా ఇది సాధ్యమయ్యింది. తమిళనాడులో వీర్య దాత ద్వారా బిడ్డను కన్న ఓ తల్లి.. బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరును తొలగించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దీంతో చిన్నారి తావిషి పెరారా దేశంలో ‘తండ్రి లేని బిడ్డగా’ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... త్రిచీకి చెందిన మధుమిత రమేష్ అనే మహిళ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారం మేర విడిపోయారు. ఆపై కొన్నిరోజుల తర్వాత వీర్యం డోనర్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో మధుమిత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే త్రిచీ కార్పొరేషన్ అధికారులు మాత్రం బిడ్డ తండ్రిగా వీర్యదాత మనిష్ మదన్‌పాల్ మీనా పేరును బర్త్ సర్టిఫికేట్లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధుమిత.. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాల్సిందిగా అధికారులకు అర్జి పెట్టుకుంది. పేర్లలో తప్పులను మాత్రమే సవరించే వీలుందని, అంతేగానీ ఏకంగా పేరునే తొలగించే అవకాశం లేదని అధికారులు ఆమెకు బదులిచ్చారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి తిరస్కరించటంతో మరోసారి ఆమె కోర్టు తలుపు తట్టారు. అదే సమయంలో ఆమె మాజీ భర్త చరణ్ రాజ్, వీర్యపు డోనర్ మనీష్‌లు ఇద్దరూ ఆ బిడ్డకు తాము తండ్రులం కాదంటూ అఫిడవిట్లు దాఖలు విశేషం. చివరకు మధుమిత అభ్యర్థనను అంగీకరించిన బెంచ్.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని త్రిచీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తద్వారా తావిషి తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లో నిలిచిపోనుంది. -
పాస్‌పోర్టుకు 'నాన్న' అవసరం లేదు!
న్యూఢిల్లీ: తండ్రితో సంబంధం లేకుండా తల్లి వద్ద నివసించే పిల్లలకు పాస్‌పోర్టు జారీ విషయంలో తండ్రి పేరును రాయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ జగన్మోహన్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యలయానికి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి పేరును ఇవ్వాలంటూ తల్లితో కలిసి జీవించే బిడ్డలను ఒత్తిడి చేయకూడదని కోర్టు పేర్కొంది. గత కొంతకాలంగా సింగిల్ పేరెంట్‌షిప్ పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న ధర్మాసనం.. పెళ్లి కాకుండా తల్లులవుతున్న మహిళలు, సెక్స్ వర్కర్స్, పెంపుడు తల్లులు, రేప్ బాధితులు, తండ్రి వదిలేసిన పిల్లలు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డలకు పాస్ పోర్టు జారీలో ఉన్న సాఫ్ట్ వేర్ కారణంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లో తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా జతచేయాల్సి రావడం సమస్యగా మారింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సాఫ్ట్ వేర్ న్యాయవ్యవస్థ కాలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని ఓ అమ్మాయికి పాస్ పోర్టును జారీ చేయకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి.. పాస్‌పోర్టు జారీకి తండ్రితో పనిలేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా 2005, 2009లలో విచారణకు వచ్చిన ఇలాంటి కేసుల తీర్పును కోర్టు ప్రస్తావించింది.