పాస్‌పోర్టుకు 'నాన్న' అవసరం లేదు!
న్యూఢిల్లీ: తండ్రితో సంబంధం లేకుండా తల్లి వద్ద నివసించే పిల్లలకు పాస్‌పోర్టు జారీ విషయంలో తండ్రి పేరును రాయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ జగన్మోహన్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యలయానికి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి పేరును ఇవ్వాలంటూ తల్లితో కలిసి జీవించే బిడ్డలను ఒత్తిడి చేయకూడదని కోర్టు పేర్కొంది.
గత కొంతకాలంగా సింగిల్ పేరెంట్‌షిప్ పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న ధర్మాసనం.. పెళ్లి కాకుండా తల్లులవుతున్న మహిళలు, సెక్స్ వర్కర్స్, పెంపుడు తల్లులు, రేప్ బాధితులు, తండ్రి వదిలేసిన పిల్లలు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డలకు పాస్ పోర్టు జారీలో ఉన్న సాఫ్ట్ వేర్ కారణంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లో తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా జతచేయాల్సి రావడం సమస్యగా మారింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సాఫ్ట్ వేర్ న్యాయవ్యవస్థ కాలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని ఓ అమ్మాయికి పాస్ పోర్టును జారీ చేయకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి.. పాస్‌పోర్టు జారీకి తండ్రితో పనిలేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా 2005, 2009లలో విచారణకు వచ్చిన ఇలాంటి కేసుల తీర్పును కోర్టు ప్రస్తావించింది.