పోటీ చేస్తాననుకుంటున్నారా చేయననుకుంటున్నారా | TDP and NCP are upholding Priyanka contribution to Narendra Modi | Sakshi
Sakshi News home page

పోటీ చేస్తాననుకుంటున్నారా చేయననుకుంటున్నారా

Published Wed, Apr 17 2019 5:37 AM | Last Updated on Wed, Apr 17 2019 6:14 AM

TDP and NCP are upholding Priyanka contribution to Narendra Modi - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి బరిలో దిగుతున్న వారణాసిలో ‘హర హర మోదీ, ఘర్‌ ఘర్‌ మోదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. మోదీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకత ఉన్న జడ్జీల నుంచి జవాన్ల వరకు సామాన్యులెందరో ఇక్కడ బరిలో దిగి ఆయనకి సవాల్‌ విసురుతున్నారు. వాళ్లతో ప్రధానికి వచ్చే ఇబ్బందేమీ లేదు కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి నుంచి పోటీకి దిగుతారని జరుగుతోన్న చర్చ రాజకీయాలను వేడెక్కిస్తోంది. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓడిపోయినప్పటికీ ప్రచారం వరకు బీజేపీని ఇరుకున పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి ప్రియాంక పోటీచేస్తే మోదీని ఎదుర్కొనే బలమైన అభ్యర్థిగా నిలుస్తారనడంలో సందేహం లేదు. వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

కాంగ్రెస్‌ విడుదల చేసిన అభ్యర్థుల తాజా జాబితాలో కూడా వారణాసి నియోజకవర్గం అభ్యర్థి పేరు ప్రస్తావించలేదు. దీంతో బరిలో ప్రియాంక దిగుతారేమోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ నోరు మెదపటం లేదు. పార్టీ తుది నిర్ణయం తీసుకుంటే తామే ప్రకటిస్తామంటూ   కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని దాటవేశారు. అలహాబాద్, వారణాసిల్లో తమకున్న బలంపై కాంగ్రెస్‌ పలు అంతర్గత సర్వేలు నిర్వహించింది గానీ ఎలాంటి ఫలితాలు వచ్చాయో వెల్లడించలేదు. ఈ ఏడాదే తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గత ఎన్నికల్లోనూ ప్రధానిపై పోటీకి ఉత్సాహం కనబరిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

పార్టీలో తలోమాట
వారణాసిలో ప్రియాంక అభ్యర్థిత్వంపై కాంగ్రెప్‌ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిపై పోటీ చేయగల సామర్థ్యం, కరిష్మా ఆమెకే ఉందని కొందరు అభిమానులు అంటుంటే, మరికొందరు గత ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు పట్టిన గతే ఆమెకీ పడుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. తొలి ప్రయత్నంలోనే ఓటమి పరాభవం కొని తెచ్చుకోవటం సరికాదని కొందరు పెద్దలు సలహా ఇస్తున్నారు. మరి కొందరు ప్రియాంక రాకతో మోదీ వారణాసికి ఎక్కువ సమయం కేటాయించి, మిగిలిన ప్రాంతాలకు వెళ్లరని అది కచ్చితంగా బీజేపీని దెబ్బతీయడమేననే వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక పోటీకి తన అంగీకారాన్ని తెలిపారని, ఆమె అన్న, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీదే తుది నిర్ణయమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన టీడీపీ, ఎన్‌సీపీ లాంటి పార్టీలు ఇప్పటికే ప్రియాంక వారణాసి అభ్యర్థిత్వంపై మద్దతు ప్రకటించాయి. 

ప్రత్యర్థి,కూటమి పార్టీలు ఏమంటున్నాయి?
నరేంద్రమోదీపై ప్రియాంక పోటీ చేయడాన్ని టీడీపీ, ఎన్‌సీపీ సమర్థిస్తున్నాయి. అయితే మహాగఠ్‌ బంధన్‌ భాగస్వామ్య పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు స్థానికంగా బలమైనవి. వారణాసి నుంచి తాము పోటీ చేయబోమని ఈ పార్టీలు హామీ ఇస్తే గానీ ప్రియాంకని కాంగ్రెస్‌ ఇక్కడ పోటీకి దింపకపోవచ్చు. వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్, ప్రియాంక 2017 నుంచి కలిసి పని చేస్తున్నారు. గెలుపుతో పాటు ఓట్లు రాబట్టడానికి కూడా ఆమె పోటీ ఉపయోగపడాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. 

ఎస్పీ, బీఎస్పీభయపడుతున్నాయా?
ఎస్పీ, బీఎస్పీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో చేర్చుకోలేదు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్న నేపథ్యంలో, రాహుల్, సోనియా పోటీ చేస్తున్న అమేథీ, రాయ్‌బరేలీల్లో అభ్యర్థులను నిలపకూడదని ఎస్పీ, బీఎస్పీ కూటమి నిర్ణయించింది. యూపీ రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశం, ముఖ్యంగా మోదీపై పోటీలో ఆమెను సమర్థిస్తే, తమ కూటమికే ఎదురుదెబ్బ తగులుతుందనే భావన వారిలో వ్యక్తమవుతోంది. 

తురుఫు ముక్కే ఓడిపోతే..? 
ఒకవేళ వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేసి ఓడిపోతే, 2014లో మోదీ చేతిలో ఓడిన ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎదురయిన కష్టాలే ఆమెకు తప్పకపోవచ్చని అంటున్నారు. ఓటమి తర్వాత కేజ్రీవాల్‌ ఢిల్లీ దాటి తన పార్టీని విస్తరించ లేకపోయారు. కాంగ్రెస్‌ పార్టీ తురుఫు ముక్కగా భావించే ప్రియాంక ఓడిపోతే ఇక కాంగ్రెస్‌ అమ్ముల పొదిలో ఆఖరి అస్త్రం మిగలకుండా పోతుంది. గత ఎన్నికలో పరాభవం నుంచి ఇంకా బయట పడలేకపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంక ఓడిపోతే మరింత డీలా పడిపోతుందనే ఆందోళనలైతే వ్యక్తమవుతున్నాయి. 

రాబర్ట్‌ వాద్రా ఫ్యాక్టర్‌
ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు రాగానే, తన భర్త ఆస్తులు కాపాడుకునేందుకే ఆమె రాజకీయాలకు వస్తున్నారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సెటైర్లు వేశారు. యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యత స్వీకరించిన రోజే ఆమె భర్త రాబర్ట్‌ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. వెంటనే ఆయనపై కేసులు ప్రియాంకకు ఇబ్బంది కలిగించాయి. ప్రియాంక వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేశాక, ఆమె ఆస్తుల వివరాలపై అందరి దృష్టి నిలుస్తుంది. ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ప్రియాంక పోటీపై రాహుల్‌ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. 

పార్టీ ప్రియాంక చేతుల్లోకి..
పోటీలో ప్రియాంకకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఇందిరా గాంధీ లాంటి రూపం అందులో ప్రధానమైంది. గతంలో ఎక్కడా పోటీ చేయకపోవటం, పార్టీ వర్గాల్లో రాహుల్‌ కన్నా ఆమె పార్టీ కార్యకర్తలతో చురుకుగా మాట్లాడడం అనుకూల అంశాలు. అయితే ఆమె పార్టీలో, ప్రజల్లో బలంగా దూసుకెళ్తే, సొంత పార్టీలో రాహుల్‌ పరిస్థితి ఏంటి? ప్రియాంక చేతుల్లోకే పార్టీ పవర్‌ అంతా వెళ్లిపోతే రాహుల్‌ గాంధీ తన నాశనం తాను కోరుకున్నట్లే అవుతుందా? ప్రియాంక ప్రధానికి వ్యతిరేకంగా పోటీ చేయటం అంటే, బీజేపీతో ప్రత్యక్ష పోరును ప్రకటిస్తున్నట్టేనా?.. ఇలాంటి చాలా అంశాలు రాహుల్‌ మెదడుని తొలిచేస్తూ ఉండవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement