
హరికృష్ణ రాజీనామా ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన నందమూరి హరికృష్ణ తన పార్లమెంటు సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. గురువారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు హరికృష్ణ సమర్పించిన రాజీనామాను చైర్మన్ అన్సారీ ఆమోదించారని రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. టీడీపీకి చెందిన ఇతర ఎంపీలతో కలిసి హరికృష్ణ గతంలో హైదరాబాద్ నుంచే తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ సచివాలయానికి పంపారు. అయితే ఆయన గురువారం ఉదయం స్వయంగా సభాధ్యక్షుడు హమీద్ అన్సారీని కలుసుకుని మరోసారి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని అందజేయడంతోపాటు స్వచ్ఛందంగానే తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
దీంతో అన్సారీ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరితో విభేదిస్తున్న హరికృష్ణ రాజీనామా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని ముక్కలు చేసేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్, యూపీఏ నిర్ణయానికి నిరసనగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం, రానున్న ఎన్నికల్లో పిడికెడు సీట్లకోసమే రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తెలుగుజాతి ఐక్యతకోసం, రాష్ట్ర సమగ్రతకోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు బాటలోనే నడుస్తానని చెప్పారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో మమేకమై తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.