* విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నామని ఐదుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీల అర్భాట ప్రకటన
* ఉత్తుత్తి రాజీనామాలు ఇచ్చి పార్లమెంటులో హడావిడి
* హరికృష్ణ రాజీనామాతో మిగతావారి రాజీనామా డ్రామాగా తేటతెల్లం
* నిబంధనల మేరకు రాజీనామాలు చేయలేదని బయటపెట్టిన నిమ్మల
సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు, నిరసనలు అంటూ డ్రామాలాడుతున్న తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వారు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి రాజీనామాలేనని, ఒక పథకం ప్రకారం ఆడిన నాటకమని తేలిపోయింది. వారు సమర్పించిన రాజీనామా లేఖలు నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్‌లో లేవని గురువారం రాజ్యసభ సాక్షిగా స్పష్టమయింది. రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్‌అన్సారీకి అందచేశారు. కొద్దిసేపటికే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రకటించటమే కాకుండా.. రాజీనామా ఆమోదం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు.
ఈ పరిణామం అనంతరం విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్పను విలేకరులు హరికృష్ణ రాజీ నామా గురించి ప్రశ్నించగా.. ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశారని, తమ రాజీనామాలు ఆ ఫార్మాట్‌లో లేవని అసలు విషయం బయటపెట్టారు. ఈ నెల 2న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశం ప్రారంభం కావటానికి గంట ముందు పార్టీ తరఫున లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణ, వై.సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), సి.ఎం.రమేష్‌లు జూబ్లీహిల్స్‌లోని సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమయ్యారు.
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రాజీనామా పత్రాలను టీడీపీపీ సమావేశంలోచంద్రబాబుకు చూపించి, అంతా బాగుందని అనుకున్న తర్వాతే స్పీకర్‌కు పంపారు. వాస్తవానికి అవేవీ స్పీకర్ ఫార్మాట్‌లో లేవని తాజాగా నిర్ధారణ అయింది. ఆ తరువాత టీడీపీ ఎంపీల అసలు డ్రామా ప్రారంభమైంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన టీడీపీ నేతలు ప్రతి రోజూ పార్లమెంటు ఉభయ సభలకు హాజరై సభా కార్యక్రమాలను అడ్డుకోవటం ప్రారంభించారు.
హరికృష్ణను ఇరకాటంలో పెట్టిన బాబు వ్యూహం
ఐదుగురు ఎంపీలు రాజీనామా ఎత్తుగడపై ముందుగానే ఒక అవగాహనకు వచ్చి సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమై రాజీనామాలు చేయనున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఆ రోజు వారి రాజీనామా విషయాన్ని హరికృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా చంద్రబాబు డెరైక్షన్‌లోనే జరిగిందని సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. అయితే ఎంపీల నిర్ణయం తెలియని హరికృష్ణ క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తగా.. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానని అప్పటికే ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.
హరికృష్ణ ప్రకటన వెలువడ్డాక.. సుజనాచౌదరి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని మీడియాకు సమాచారం పంపిన తరువాత.. సుజనాచౌదరితో పాటు టీడీపీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టి.డి.జనార్దనరావులు హరికృష్ణకు ఫోన్ చేశారు. పార్టీ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని, అందులో భాగస్వామి కావాలని కోరి ఆయనను ఇరకాటంలో పెట్టారు.
అప్పటికే హరికృష్ణ ప్రకటన చేయటంతో.. ఆయన్ను సీమాంధ్ర ప్రాంత నేతల్లో దోషిగా నిలెబట్టగలిగామని చంద్రబాబు, మిగతా ఎంపీలు సంబరపడ్డారని ఆ సీనియర్ నాయకుడు వివరించారు. చంద్రబాబు, సహచర ఎంపీల చర్యతో ఇరకాటంలోపడ్డ హరికృష్ణ రెండు రోజుల కిందట ఆత్మావిష్కరణ పేరుతో మరో ప్రకటన చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, త్వరలో ప్రజల్లోకి వెళతానని మొదటి లేఖకు భిన్నంగా రెండో ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా హరికృష్ణ రాజీనామా చేయటం, దానిని వెంటనే ఆమోదించటంతో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఇతర నేతలు కంగుతిన్నారు. హరికృష్ణ రాజీనామా గురించి తెలిసిన వెంటనే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మిగిలిన పార్టీ ఎంపీలు కూడా అదేబాటలో నడవాలన్న డిమాండ్ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది.
కోట్లు పోసి కొన్న సీట్లకు రాజీనామా చేస్తారా?
హరికృష్ణ రాజీనామా ఆమోదం పొందటంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన కోటరీలోని సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తారా? లేదా? అన్న విషయంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రాజ్యసభ సీట్లు తీసుకున్నందున వారు రాజీనామాలు చేయలేరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
కురియన్‌తో బాబు మాటామంతీ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తో చంద్రబాబునాయుడు చాలాసేపు మాట్లాడారు. బుధవారం బాలకృష్ణ చిన్న కూతురు వివాహ కార్యక్రమానికి కురియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకించి కురియన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు. వివాహ కార్యక్రమంలో కురియన్‌తో మాట్లాడటానికే చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపటంపై టీడీపీ నేతలు కూడా ఆసక్తికరంగా చర్చించుకున్నారు.
డ్రామా బాబుల గుట్టురట్టు!
Published Fri, Aug 23 2013 2:05 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement