Mohammad Hamid Ansari
-
అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు బుధవారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. సదరు జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టును తానెన్నడూ కలవడం గానీ, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు. నుస్రత్ మీర్జా అనే పాకిస్తాన్ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘2005–11 మధ్య అన్సారీ తనను కనీసం ఐదుసార్లు భారత్‌కు ఆహ్వానించినట్టు మీర్జా చెప్పాడు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కూడా మీర్జా ఆయన నుంచి రాబట్టి ఐఎస్ఐతో పంచుకున్నట్టుగా కన్పిస్తోంది. అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా కూడా దేశ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఇదంతా దేశద్రోహం కాక మరేమిటి? దేశ ప్రజలు ఆయన్ను ఎంతగానో గౌరవిస్తుంటే ఆయనేమో దేశానికే ద్రోహం తలపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ మొత్తం ఉదంతంలో అన్సారీతో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ బదులివ్వాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాళ్లు తక్షణం నిర్దోషిత్వం నిరూపించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. శత్రు గూఢచారులను భారత్‌కు అధికారికంగా ఆహ్వానించడమే ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరా అని ప్రశ్నించారు. అన్సారీని ఉద్దేశించి పాక్ జర్నలిస్టు బయటపెట్టిన విషయాలు చాలా తీవ్రమైనవని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా అన్నారు. ‘‘అన్సారీ వంటి వ్యక్తిని యూపీఏ రెండుసార్లు ఉపరాష్ట్రపతిని చేసింది. దీన్నిబట్టి యూపీఏ హయాంలో దేశ అత్యున్నత పదవుల్లో నియామకాల విషయంలో గోల్మాల్ జరిగిందా అన్న తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు. 2007లో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతి అయిన అన్సారీ 2017 దాకా పదవిలో కొనసాగారు. మోదీ అండ్ కో దిగజారుడుతనం: జైరాం బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అన్సారీ, సోనియా వ్యక్తిత్వాలను కించపరిచే నీచ ప్రయత్నమంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ దుయ్యబట్టారు. వ్యక్తిత్వ హననానికి ఇది పరాకాష్ట అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుయాయుల దిగజారుడుతనానికి అంతులేకుండా పోతోందని విమర్శించారు. వాళ్ల మనసులు ఎంత రోగగ్రస్తంగా మారాయో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. నాది మచ్చలేని పనితీరు: అన్సారీ బీజేపీ ఆరోపణలను ఖండిస్తూ అన్సారీ ప్రకటన విడుదల చేశారు. ‘‘2010 డిసెంబర్ 10న ఉగ్రవాదంపై సదస్సును నేను ప్రారంభించి ప్రసంగించాను. నిర్వాహకులు ఎవరిని ఆహ్వానించిందీ నాకు తెలియదు. నేనెవరినీ ఆహ్వానించలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ రాయబారిగా నేను చేసిన ప్రతి పనీ నాటి కేంద్ర ప్రభుత్వ ఎరుకలో ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయాలపై ఇంతకంటే ఏమీ వ్యాఖ్యానించలేను. ఇరాన్ విధుల అనంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడినయ్యా. నా పనితీరును భారత్‌తో పాటు ప్రపంచమంతా గుర్తించింది’’ అని చెప్పారు. అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఆయన ఓఎస్డీగా పని చేసిన గుర్‌ప్రీత్‌సింగ్ సప్పల్ కూడా బీజేపీ ఆరోపణలను ఖండించారు. ‘‘మీర్జా ఎక్కడా తనను అన్సారీ ఆహ్వానించారని చెప్పలేదు. ఆయన ప్రసంగించిన సెమినార్లో మిగతా జర్నలిస్టులతో పాటు మీర్జా కూడా ఉన్నాడంతే’’ అంటూ ట్వీట్ చేశారు. -
జామియాలో మహిళల క్యాంటీన్
న్యూఢిల్లీ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేదిశగా జామియా మిల్లియా ఇస్లామియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అందరూ మహిళలే భాగస్వాములుగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని భారత ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమిద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ శుక్రవారం ప్రారంభించారు. జామియా సమీపంలో ఉన్న ఏక్తా అనే స్వయం సహాయక బృందం సభ్యులు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. జామియా చర్య అభినందనీయమన్నారు. మహిళలు సాధికారత సాధించిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జామియా మీడియా అనుసంధానకర్త ముఖేష్ రంజన్ మాట్లాడుతూ.. బృందం మహిళలకు తగిన శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంటీన్లో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని అన్నారు. కాగా, ఈ క్యాంటీన్లో వంటమనిషిగా చేరిన గుల్ష్మా మాట్లాడుతూ.. తాను క్యాటరింగ్ విషయంలో సాకేత్‌లో ఇప్పటికే కొంత శిక్షణ పొందానని తెలిపింది. ఇక్కడ పనిచేయడం ద్వారా తన కుటుంబ పోషణకు అవసరమైన సొమ్ము సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
డ్రామా బాబుల గుట్టురట్టు!
-
హరికృష్ణ రాజీనామా ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన నందమూరి హరికృష్ణ తన పార్లమెంటు సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. గురువారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు హరికృష్ణ సమర్పించిన రాజీనామాను చైర్మన్ అన్సారీ ఆమోదించారని రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. టీడీపీకి చెందిన ఇతర ఎంపీలతో కలిసి హరికృష్ణ గతంలో హైదరాబాద్ నుంచే తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ సచివాలయానికి పంపారు. అయితే ఆయన గురువారం ఉదయం స్వయంగా సభాధ్యక్షుడు హమీద్ అన్సారీని కలుసుకుని మరోసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని అందజేయడంతోపాటు స్వచ్ఛందంగానే తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు స్పష్టం చేశారు. దీంతో అన్సారీ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరితో విభేదిస్తున్న హరికృష్ణ రాజీనామా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని ముక్కలు చేసేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్, యూపీఏ నిర్ణయానికి నిరసనగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం, రానున్న ఎన్నికల్లో పిడికెడు సీట్లకోసమే రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తెలుగుజాతి ఐక్యతకోసం, రాష్ట్ర సమగ్రతకోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు బాటలోనే నడుస్తానని చెప్పారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో మమేకమై తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. -
డ్రామా బాబుల గుట్టురట్టు!
* విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నామని ఐదుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీల అర్భాట ప్రకటన * ఉత్తుత్తి రాజీనామాలు ఇచ్చి పార్లమెంటులో హడావిడి * హరికృష్ణ రాజీనామాతో మిగతావారి రాజీనామా డ్రామాగా తేటతెల్లం * నిబంధనల మేరకు రాజీనామాలు చేయలేదని బయటపెట్టిన నిమ్మల సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు, నిరసనలు అంటూ డ్రామాలాడుతున్న తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వారు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి రాజీనామాలేనని, ఒక పథకం ప్రకారం ఆడిన నాటకమని తేలిపోయింది. వారు సమర్పించిన రాజీనామా లేఖలు నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్లో లేవని గురువారం రాజ్యసభ సాక్షిగా స్పష్టమయింది. రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్‌అన్సారీకి అందచేశారు. కొద్దిసేపటికే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రకటించటమే కాకుండా.. రాజీనామా ఆమోదం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పరిణామం అనంతరం విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్పను విలేకరులు హరికృష్ణ రాజీ నామా గురించి ప్రశ్నించగా.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశారని, తమ రాజీనామాలు ఆ ఫార్మాట్లో లేవని అసలు విషయం బయటపెట్టారు. ఈ నెల 2న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశం ప్రారంభం కావటానికి గంట ముందు పార్టీ తరఫున లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణ, వై.సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), సి.ఎం.రమేష్‌లు జూబ్లీహిల్స్‌లోని సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రాజీనామా పత్రాలను టీడీపీపీ సమావేశంలోచంద్రబాబుకు చూపించి, అంతా బాగుందని అనుకున్న తర్వాతే స్పీకర్‌కు పంపారు. వాస్తవానికి అవేవీ స్పీకర్ ఫార్మాట్లో లేవని తాజాగా నిర్ధారణ అయింది. ఆ తరువాత టీడీపీ ఎంపీల అసలు డ్రామా ప్రారంభమైంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన టీడీపీ నేతలు ప్రతి రోజూ పార్లమెంటు ఉభయ సభలకు హాజరై సభా కార్యక్రమాలను అడ్డుకోవటం ప్రారంభించారు. హరికృష్ణను ఇరకాటంలో పెట్టిన బాబు వ్యూహం ఐదుగురు ఎంపీలు రాజీనామా ఎత్తుగడపై ముందుగానే ఒక అవగాహనకు వచ్చి సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమై రాజీనామాలు చేయనున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఆ రోజు వారి రాజీనామా విషయాన్ని హరికృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా చంద్రబాబు డెరైక్షన్లోనే జరిగిందని సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. అయితే ఎంపీల నిర్ణయం తెలియని హరికృష్ణ క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తగా.. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానని అప్పటికే ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. హరికృష్ణ ప్రకటన వెలువడ్డాక.. సుజనాచౌదరి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని మీడియాకు సమాచారం పంపిన తరువాత.. సుజనాచౌదరితో పాటు టీడీపీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టి.డి.జనార్దనరావులు హరికృష్ణకు ఫోన్ చేశారు. పార్టీ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని, అందులో భాగస్వామి కావాలని కోరి ఆయనను ఇరకాటంలో పెట్టారు. అప్పటికే హరికృష్ణ ప్రకటన చేయటంతో.. ఆయన్ను సీమాంధ్ర ప్రాంత నేతల్లో దోషిగా నిలెబట్టగలిగామని చంద్రబాబు, మిగతా ఎంపీలు సంబరపడ్డారని ఆ సీనియర్ నాయకుడు వివరించారు. చంద్రబాబు, సహచర ఎంపీల చర్యతో ఇరకాటంలోపడ్డ హరికృష్ణ రెండు రోజుల కిందట ఆత్మావిష్కరణ పేరుతో మరో ప్రకటన చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, త్వరలో ప్రజల్లోకి వెళతానని మొదటి లేఖకు భిన్నంగా రెండో ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా హరికృష్ణ రాజీనామా చేయటం, దానిని వెంటనే ఆమోదించటంతో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఇతర నేతలు కంగుతిన్నారు. హరికృష్ణ రాజీనామా గురించి తెలిసిన వెంటనే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మిగిలిన పార్టీ ఎంపీలు కూడా అదేబాటలో నడవాలన్న డిమాండ్ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది. కోట్లు పోసి కొన్న సీట్లకు రాజీనామా చేస్తారా? హరికృష్ణ రాజీనామా ఆమోదం పొందటంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన కోటరీలోని సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తారా? లేదా? అన్న విషయంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రాజ్యసభ సీట్లు తీసుకున్నందున వారు రాజీనామాలు చేయలేరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. కురియన్‌తో బాబు మాటామంతీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తో చంద్రబాబునాయుడు చాలాసేపు మాట్లాడారు. బుధవారం బాలకృష్ణ చిన్న కూతురు వివాహ కార్యక్రమానికి కురియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకించి కురియన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు. వివాహ కార్యక్రమంలో కురియన్‌తో మాట్లాడటానికే చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపటంపై టీడీపీ నేతలు కూడా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. -
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశ 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక భారత నిర్మాణం కోసం ప్రజలంతా పనిచేయాలని అన్సారీ తన సందేశంలో సూచించగా పాకిస్థాన్‌తో శాంతి, స్నేహం, సహకారం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. -
మంట పెట్టిన బులెటిన్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి.. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారంటూ పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించే బులెటిన్‌లో ప్రచురించడం రాజ్యసభలో మంట పెట్టింది. అందులో తమ పేర్లను వెల్లడించడంపై టీడీపీ, బీజేపీ సభా కార్యక్రమాలను బహిష్కరించాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభా కార్యక్రమాలు జరగడం ఏమిటంటూ మిగతా పక్షాలు కూడా అడ్డుకోవడంతో.. దీనిపై చర్చిద్దామని, ఒక కొత్త విధానాన్ని రూపొందిద్దామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బులెటిన్ అంశాన్ని లేవనెత్తారు. ఇది సభ్యుల హక్కులను హరించే విధంగా, అవమానపరిచేలా ఉందని.. దానిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై తర్వాత తన చాంబర్లో చర్చిద్దామని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించినా.. బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ వాయిదాపడింది. తిరిగి సభ సమావేశమయ్యాక.. సైనికుల కాల్చివేత ఘటనపై ప్రకటన చేస్తున్న రక్షణ మంత్రి ఆంటోనీని అన్నాడీఎంకే, ఏజీపీ, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేశారు. దీంతో చైర్మన్ చాంబర్లో రాజకీయ పక్షాల నేతల సమావేశాన్ని నిర్వహించి ఒక అవగాహనను కుదుర్చుకున్నారు. బులెటిన్ నుంచి సభ్యుల పేర్లను తొలగించే విషయాన్ని చైర్మన్ పరిశీలిస్తారని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ హామీ ఇచ్చారు. కాగా.. నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తమ పేర్లను బులిటెన్‌లో పెట్టడం అన్యాయమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. -
ముస్లింలకు ప్రముఖుల ఈద్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకొంటున్న ముస్లింలకు వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సమైక్యతకు ఈ పండుగ దోహదపడాలని రాష్ట్రపతి ప్రణబ్ గురువారం విడుదల చేసిన తన సందేశంలో ఆకాంక్షించారు. ఈ పర్వదినం శాంతి సామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, పురోగతికి దోహదపడాలని ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా సంక్షోభంతో సతమతమవుతున్న సిరియాకు మానవతా సాయంగా రూ.1,184 కోట్లుఅదనపు సాయాన్ని ప్రకటించారు. భారత్‌లోని కేరళ రాష్ట్రంతో పాటు ఇండోనేసియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాల్లో ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని గురువారం నాడే జరుపుకున్నారు. -
తెలంగాణ అంశంపై స్తంభించిన పార్లమెంటు
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు జరిపిన ఆందోళనలతో గురువారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. మధ్యాహ్నం వరకూ ఉభయసభ లూ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అలాగే, రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి సమావేశాలకు అంతరాయం కల్గిస్తున్న ఎంపీల జాబితాలో తమవారిని కూడా చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారి పోడియం ముందు నిరసనలు కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. ఇదిలాఉండగా, తెలంగాణ అంశంపై వచ్చేవారం చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించేందుకు గురువారం అంగీకరించారు. రాష్ట్ర విభ జన అంశంపై రాజ్యసభలో ఆందోళన చేస్తూ.. తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ మధ్యాహ్నం అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే పార్లమెంట్ సభ్యుల ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు.