సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి.. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారంటూ పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించే బులెటిన్‌లో ప్రచురించడం రాజ్యసభలో మంట పెట్టింది. అందులో తమ పేర్లను వెల్లడించడంపై టీడీపీ, బీజేపీ సభా కార్యక్రమాలను బహిష్కరించాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభా కార్యక్రమాలు జరగడం ఏమిటంటూ మిగతా పక్షాలు కూడా అడ్డుకోవడంతో.. దీనిపై చర్చిద్దామని, ఒక కొత్త విధానాన్ని రూపొందిద్దామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఉదయం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బులెటిన్ అంశాన్ని లేవనెత్తారు. ఇది సభ్యుల హక్కులను హరించే విధంగా, అవమానపరిచేలా ఉందని.. దానిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై తర్వాత తన చాంబర్‌లో చర్చిద్దామని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించినా.. బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ వాయిదాపడింది. తిరిగి సభ సమావేశమయ్యాక.. సైనికుల కాల్చివేత ఘటనపై ప్రకటన చేస్తున్న రక్షణ మంత్రి ఆంటోనీని అన్నాడీఎంకే, ఏజీపీ, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ సభ్యులు అడ్డుకున్నారు.
ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేశారు. దీంతో చైర్మన్ చాంబర్‌లో రాజకీయ పక్షాల నేతల సమావేశాన్ని నిర్వహించి ఒక అవగాహనను కుదుర్చుకున్నారు. బులెటిన్ నుంచి సభ్యుల పేర్లను తొలగించే విషయాన్ని చైర్మన్ పరిశీలిస్తారని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ హామీ ఇచ్చారు. కాగా.. నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తమ పేర్లను బులిటెన్‌లో పెట్టడం అన్యాయమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.
మంట పెట్టిన బులెటిన్
Published Fri, Aug 9 2013 6:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement