తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు జరిపిన ఆందోళనలతో గురువారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. మధ్యాహ్నం వరకూ ఉభయసభలూ వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు జరిపిన ఆందోళనలతో గురువారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. మధ్యాహ్నం వరకూ ఉభయసభ లూ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అలాగే, రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి సమావేశాలకు అంతరాయం కల్గిస్తున్న ఎంపీల జాబితాలో తమవారిని కూడా చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.
టీడీపీ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారి పోడియం ముందు నిరసనలు కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. ఇదిలాఉండగా, తెలంగాణ అంశంపై వచ్చేవారం చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించేందుకు గురువారం అంగీకరించారు. రాష్ట్ర విభ జన అంశంపై రాజ్యసభలో ఆందోళన చేస్తూ.. తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ మధ్యాహ్నం అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే పార్లమెంట్ సభ్యుల ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు.