Members of Congress
-
ఆకర్ష్ గులాబీ..!
- టీఆర్ఎస్ గూటికి మరికొంతమంది - మొగ్గుచూపుతున్న ఓ మున్సిపల్ చైర్మన్ - అదేబాటలో 9మంది కాంగ్రెస్, - టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీవైపు - కొందరు ఎంపీపీల చూపు - ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు గులాబీదళ వ్యూహం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచి ప్రారంభమైన రాజకీయ వలసలు.. ఎంపీపీ, జెడ్పీ, మున్సిపల్ పాలకమండళ్ల ఏర్పాటు సమయంలో తీవ్రరూపం దాల్చాయి. వాటి ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. పార్టీ ఫిరాయింపులు ఇంతటితో ముగిసేలా లేవు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీలో చేరేందుకు పలువురు ప్రజాప్రతినిధులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 9మంది జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. కొందరు ఎంపీపీలు సైతం అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రలోభాల ఎర చూపడం.. లేదంటే ఇదివరకు ఎంపీపీ, జెడ్పీటీసీ పదువులు అనుభవించిన వారు చేపట్టిన పనులను నిధులు మంజూరు చేసేందుకు తాత్కాలికంగా కొర్రీ విధించడం.. పనులను నాణ్యతను చూశాకే.. మంజూరు చేస్తామని చెబుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని గులాబీవైపు మళ్లించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఒక్కొక్కరిగా కాకుండా అందరినీ ఒకే వేదికమీద కండువాలను కప్పి తమ పార్టీలో చేరేందుకు సందర్భంకోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా.. గులాబీ పార్టీ ప్రతిష్టను కూడా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్ర రాజకీయ కూటములతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ సరిపడినంత సంఖ్యాబలం లేని చోట ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. క్యాంపుల పేరిట తమ సభ్యులు చేజారకుండా పార్టీలు, నేతలు కట్టుదిట్టంగా వ్యవహరించినా పలుచోట్ల ఫిరాయింపులు జరిగాయి. పార్టీలు, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంతో ‘కలగూర గంప’ కూటములకు మండల పరిషత్ పీఠాలు దక్కాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. వ్యూహాత్మక ఎన్నిక..! జెడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ఇతర పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విప్ ఉల్లంఘించి టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కొత్తూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డికి వైస్ చైర్మన్ పదవి దక్కింది. 64మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికయ్యేందుకు కనీసం 33మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా.. టీఆర్ఎస్కు చెందిన 25మంది సభ్యులతో పాటు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు సహకరించడంతో సంఖ్యాబలం 35కు చేరింది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోగలిగారు. 64 మండల పరిషత్‌లకు గాను 62 మండలాలకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి 27చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులు, 20 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. -
మీరా...మేమా..
జిల్లా పరిషత్ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహ.. ప్రతివ్యూహాలు పోటాపోటీగా క్యాంపులు ఊటిలో కాంగ్రెస్ సభ్యులు 25 మంది ఉన్నారని ధీమా 22 మంది సభ్యులతో ఢిల్లీలో టీఆర్ఎస్ శిబిరం రెండు రోజుల్లో పూర్తి బలం సాధిస్తామంటున్న గులాబీ నేతలు కీలకం కానున్న కాంగ్రెస్ నేత ‘దుగ్యాల’ నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహప్రతివ్యూహాలతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక ఆసక్తిగా మారింది. జిల్లాపరిషత్‌పై జెండా ఎగురవేసేందుకు ఎక్కువ జెడ్పీటీసీ సభ్యులు గెలి చిన కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీగా ఉన్న అనుకూలత, ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునే వ్యూహాలతో జెడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకు టీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 24 స్థానాలను దక్కించుకుంది. టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ ఒక స్థానాల్లో విజయం సాధించగా... స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరడంతో అందరి దృష్టి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికపై పడింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కావడంతో జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీకి మంచి పట్టుంది. ఈ మేరకు వరంగల్ జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని గులాబీ నేతలు పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవసరమైన మెజారిటీ దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీ రాజకీయంలో టీఆర్ఎస్ నేత, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాం గ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఊటి క్యాంపులో 25 మంది..! కాంగ్రెస్ జెడ్పీటీసీల క్యాంపు ప్రస్తుతం ఊటిలో ఉందని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాంపులో 25 మంది ఉన్నారని అంటున్నారు. 21 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు, బీజేపీ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ సభ్యుడు ఈ క్యాంపులో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొం టున్నారు. అంతేకాదు... జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ సభ్యులకు ఇచ్చేలా.. అవగాహన కుదుర్చుకుని ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను తమ క్యాంపులో చేర్చుకుంటామని అంటున్నారు. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి... కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. టికెట్ ఇవ్వడకపోవడంతో రెబెల్‌గా పోటీకి దిగి గెలిచిన దొంతి మాధవరెడ్డిని మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ముఖ్యులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో ఆయనకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో మూడు జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్‌కు వచ్చాయి. ప్రస్తుతం వీరు ముగ్గురు కాంగ్రెస్ క్యాంపులో లేరు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ దుగ్యాల శ్రీనివాసరావు ఆదేశాలతో వీరు ప్రత్యేక క్యాంపులో ఉన్నారు. వీరి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికను నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ క్యాంపులో 22 మంది..! టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు ప్రస్తుతం ఢిల్లీలో ఉందని, ఈ క్యాంపులో 25 మంది ఉన్నట్లు వీరు చెబుతున్నారు. టీఆర్ఎస్కు చెందిన 18 మంది, టీడీపీకి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుతం క్యాంపులో ఉన్నారని అంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు తమ క్యాంపులోనే ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాదు... శుక్రవారానికి ఈ సంఖ్య 28కి చేరుకుంటుందని ధీమాగా ఉన్నారు. అరుుతే... పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు... తాము వేరుగా ఉన్నామని అంటున్నారు. వీరు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తారా... కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ దుగ్యాల శ్రీనివాసరావు ఎవరికి వారే పట్టుమీదున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో దీనిపై స్పష్టత రాలేదు. మరోసారి వీరు భేటీ అయి కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి గెలిచేలా చేసుకుంటారా... లేదా అనే దానిపై టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేయనుంది. చెరి 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ధీమాతో ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. -
తెలంగాణ అంశంపై స్తంభించిన పార్లమెంటు
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు జరిపిన ఆందోళనలతో గురువారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. మధ్యాహ్నం వరకూ ఉభయసభ లూ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే.. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అలాగే, రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి సమావేశాలకు అంతరాయం కల్గిస్తున్న ఎంపీల జాబితాలో తమవారిని కూడా చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారి పోడియం ముందు నిరసనలు కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. ఇదిలాఉండగా, తెలంగాణ అంశంపై వచ్చేవారం చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించేందుకు గురువారం అంగీకరించారు. రాష్ట్ర విభ జన అంశంపై రాజ్యసభలో ఆందోళన చేస్తూ.. తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ మధ్యాహ్నం అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే పార్లమెంట్ సభ్యుల ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు.