మీరా...మేమా.. | Competing camps | Sakshi
Sakshi News home page

మీరా...మేమా..

Published Fri, Jun 6 2014 5:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

Competing camps

  • జిల్లా పరిషత్ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహ.. ప్రతివ్యూహాలు
  •       పోటాపోటీగా క్యాంపులు
  •      ఊటిలో కాంగ్రెస్ సభ్యులు
  •      25 మంది ఉన్నారని ధీమా
  •      22 మంది సభ్యులతో ఢిల్లీలో టీఆర్‌ఎస్ శిబిరం
  •      రెండు రోజుల్లో పూర్తి బలం సాధిస్తామంటున్న గులాబీ నేతలు
  •      కీలకం కానున్న కాంగ్రెస్ నేత ‘దుగ్యాల’ నిర్ణయం
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహప్రతివ్యూహాలతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక ఆసక్తిగా మారింది. జిల్లాపరిషత్‌పై జెండా ఎగురవేసేందుకు ఎక్కువ జెడ్పీటీసీ సభ్యులు గెలి చిన కాంగ్రెస్  తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీగా ఉన్న అనుకూలత, ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునే వ్యూహాలతో జెడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకు టీఆర్‌ఎస్  కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

    ఇందులో కాంగ్రెస్ 24 స్థానాలను దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ ఒక స్థానాల్లో విజయం సాధించగా... స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరడంతో అందరి దృష్టి జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికపై పడింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కావడంతో జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీకి మంచి పట్టుంది.

    ఈ మేరకు వరంగల్ జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని గులాబీ నేతలు పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండడంతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవసరమైన మెజారిటీ దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీ రాజకీయంలో టీఆర్‌ఎస్ నేత, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాం గ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీ వ్యూహాలతో జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
     
    ఊటి క్యాంపులో 25 మంది..!
     
    కాంగ్రెస్ జెడ్పీటీసీల క్యాంపు ప్రస్తుతం ఊటిలో ఉందని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాంపులో 25 మంది ఉన్నారని అంటున్నారు. 21 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు, బీజేపీ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ సభ్యుడు ఈ క్యాంపులో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొం టున్నారు. అంతేకాదు... జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ సభ్యులకు ఇచ్చేలా.. అవగాహన కుదుర్చుకుని ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను తమ క్యాంపులో చేర్చుకుంటామని అంటున్నారు.

    జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి... కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. టికెట్ ఇవ్వడకపోవడంతో రెబెల్‌గా పోటీకి దిగి గెలిచిన దొంతి మాధవరెడ్డిని మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ముఖ్యులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో ఆయనకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో మూడు జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్‌కు వచ్చాయి. ప్రస్తుతం వీరు ముగ్గురు కాంగ్రెస్ క్యాంపులో లేరు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దుగ్యాల శ్రీనివాసరావు ఆదేశాలతో వీరు ప్రత్యేక క్యాంపులో ఉన్నారు. వీరి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశం జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికను నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది.
     
    ఢిల్లీ క్యాంపులో 22 మంది..!
     
    టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు ప్రస్తుతం ఢిల్లీలో ఉందని, ఈ క్యాంపులో 25 మంది ఉన్నట్లు వీరు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 18 మంది, టీడీపీకి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుతం క్యాంపులో ఉన్నారని అంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు తమ క్యాంపులోనే ఉన్నట్లు టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.

    అంతేకాదు... శుక్రవారానికి ఈ సంఖ్య 28కి చేరుకుంటుందని ధీమాగా ఉన్నారు. అరుుతే... పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు... తాము వేరుగా ఉన్నామని అంటున్నారు. వీరు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారా... కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దుగ్యాల శ్రీనివాసరావు ఎవరికి వారే పట్టుమీదున్నారు.

    కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో దీనిపై స్పష్టత రాలేదు. మరోసారి వీరు భేటీ అయి కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థి గెలిచేలా చేసుకుంటారా... లేదా అనే దానిపై టీఆర్‌ఎస్ వ్యూహాలు అమలు చేయనుంది. చెరి 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ధీమాతో ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక  రసవత్తరంగా మారింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement