
రాహుల్ సభలో అలజడి : టెకీలను అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూర్ : రాహుల్ సభలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టెకీలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ నగరం బెంగళూర్‌లోని మన్యతా టెక్‌పార్క్‌లో మంగళవారం ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తుండగా వేదిక వెలుపల కొందరు ఆందోళనకారులు మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ రాహుల్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించారు. వేదిక నుంచి రాహుల్ వెళ్లిపోవాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
పోలీసులు వారించినా ఆందోళనకారులు రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిరసనకారుల్లో టెకీలు కూడా ఉన్నారని బీజేపీ పేర్కొంది. పోలీసు చర్యను తీవ్రంగా గర్హించిన బీజేపీ నిరసనకారులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించింది. కాంగ్రెస్-జేడిఎస్ పాలిత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పాలక సర్కార్ అణిచివేస్తోందని బీజేపీ ఆరోపించింది.