'త్వరలోనే తీస్తా నదీ జలాల వివాదం పరిష్కారం'
కోల్ కతా: త్వరలోనే భారత్- బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల పంపిణీ వివాదానికి పరిష్కారం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో ఆ నదీ జలాల వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలక్రితం భారత్ -బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సరిహద్దుల వివాదం ఒక కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. ఇక తీస్తా నదీ జలాల ఒప్పందం ఒకటే మిగిలి ఉందని.. అది కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని రాజ్ నాథ్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మమతా బెనర్జీ సర్కారు నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు.