
మాయావతితో తేజస్వీ మంతనాలేమిటీ?
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతిని ఇటీవల కలుసుకొని గంటన్నర సేపు చర్చలు జరిపారు.
న్యూఢిల్లీ: ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతిని ఇటీవల కలుసుకొని గంటన్నర సేపు చర్చలు జరిపారు. మాయావతి ఢిల్లీ నివాసంలో జరిగిన ఈ చర్చలకు ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల వరకు వివిధ అంశాల గురించి వారు చర్చించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి కూటమికి ప్రత్యామ్నాయ కూటమిని కూడగట్టాలన్నదే తేజస్వీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌తోని సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న తేజస్వీ ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతో ఓ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రానున్న రెండు యూపీ పార్లమెంట్ సీట్ల ఉప ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడమే ఆయన ఎత్తుగడ. అందులో భాగంగానే మాయావతితో చర్చలు జరిపారు. యూపీలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన బీజేపీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీని బలమైన కూటమిగా మార్చడం ఆయన భవిష్యత్తు లక్ష్యమని ఆయన అనుచరులు చెబుతున్నారు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రతిపక్ష కూటమికి కషి చేస్తున్నప్పటికీ యూపీ స్థాయిలో అఖిలేష్‌తో తనకున్న సంబంధాలను ఉపయోగించి తనవంతు కషి చేయాలన్నది తేజస్వీ తాపత్రయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు వారు రాష్ట్రంలో పదవులు చేపట్టిన ఆరు నెలల్లోపల రాష్ట్రంలోని ఉభయ సభల్లో ఒక సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. ఆగస్టు ఐదవ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే వారివురు గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేస్తారు. మాయావతి రాజ్యసభకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఫుల్‌పూర్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఆమె లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఉంది. అప్పుడు గోరఖ్‌పూర్ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారు. యోగి, కేశవ్‌లు అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే వారిపై కూడా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలన్నది వ్యూహం.
సమాజ్‌వాది పార్టీలో మాయావతి ఎప్పుడూ ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు గానీ ఆమె గురువు, బీఎస్పీ వ్యవస్థాపక నాయకుడు కాన్షీరామ్, రామమందిరం ఉద్యమం పేరుతో బలోపేతమవుతున్న బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు 1993లో ములాయం నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీతోని పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు బీజేపీ ఓడిపోవడంతో బీఎస్పీ మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రయ్యారు. 1995లో బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ములాయం ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వాన్ని పడకొట్టారన్న కారణంగా మాయావతిపై దాడిచేసేందుకు ఎస్పీ గూండాల సిద్ధమయ్యారు. ఆమె అప్పుడు లక్నో అతిథి గహంలో తలదాచుకున్నారు. భయట గూండాలు ఆమెకోసం రోజంతా కాపుగాశారు. అది తాను జీవితంలో మరచిపోలేని పరాభవమని ఆమె ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. అందుకనే ఆమె మళ్లీ ఎస్పీతో ఎన్నికల పొత్తుకు ఎన్నడూ ప్రయత్నించలేదు.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఒక్కసీటు కూడా రాకపోవడం, 2012లో పార్టీకి 80 సీట్లు ఉండగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీట్లు 19కి పడిపోవడంతో మాయావతి వైఖరిలో మార్పు వచ్చింది. పైగా సమాజ్‌వాది పార్టీకి అధినేత ఇప్పుడు అఖిలేష్ అన్న భావన కూడా ఆమె వైఖరి మార్పునకు కారణమైంది. బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా తాము పొత్తుకు సిద్ధమని మాయావతి ఇటీవల ప్రకటించడం ఇక్కడ గమనార్హం.