వీరే రేపటి జాతీయ రాజకీయ నిర్ణేతలు | These Leaders Will Play Key Role in National Politics | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 2 2019 4:25 PM | Last Updated on Wed, Jan 2 2019 4:31 PM

These Leaders Will Play Key Role in National Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా భారత రాజకీయాలు ఉపరితలం మీది నుంచి చూస్తే ఒకే తీరుగా కనిపిస్తాయి. ఏడాదికేడాది పెద్దగా మార్పు కనిపించదు. కొత్త పార్టీలు పుడుతుంటాయి. పాత పార్టీలు మరింత పాత పార్టీల్లో విలీనం అవుతుంటాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే ఏడాదికేడాదికే కొట్టొచ్చినట్లుండే మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా 2018 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనుమరుగవుతారనుకున్న నాయకులు అనూహ్యంగా మళ్లీ జీవం పోసుకున్నారు. మరోపక్క యువతరం నాయకుడు అలుపెరగని పాదయాత్రతో ప్రజాహృదయాలను హత్తుకుంటూ వెచ్చని ఉదయ భానుడిలాపైకొచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను శాసించే స్థాయికి చేరుకున్న వారే అఖిలేష్‌ యాదవ్, మాయావతి, తేజస్వీ యాదవ్, కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు.

మాయావతి
ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీకి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు షాకిచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ కనీసం ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. ఇక 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 80 సీట్లను గెలుచుకుంది. యూపీలోని గోరక్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించడం ద్వారా మాయావతి బలపడ్డారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ రెండు సీట్లను గెలుచుకొంది. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఎస్పీతో కలిసి యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు బీఎస్పీ పోటీ చేయనుంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి గురించి ఆమె తన 63వ పుట్టిన రోజైనా జనవరి 15వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

అఖిలేష్‌ యాదవ్‌
అంతకుముందు జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 224 సీట్లను గెలుచుకున్న అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ సమాజ్‌వాది పార్టీ 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలసి పోటీ చేసి కేవలం 54 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. తండ్రి ములాయం సింగ్‌తో, బాబాయి శివపాల్‌ యాదవ్‌తో తగాదా పడడం ఆయనను రాజకీయంగా బాగా దెబ్బతీసింది. తండ్రిని దగ్గరికి తీసుకొని పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ములాయం వారసుడిగా ప్రజల ముందుకు వచ్చారు. బీఎస్పీ మద్దతుతో గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు గెలుచుకోవడం ద్వారా ఆయన రాజకీయంగా బరింత బలపడ్డారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోవడం ద్వారా రాష్ట్రంలోను తిరిగి పట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తేజస్వీ యాదవ్‌
బీహార్‌లో జేడీయూతో పార్టీకున్న అధికార బంధం తెగిపోవడం, తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకెళ్లడం తదితర పరిణామాలు ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను కుంగదీసాయనడంలో సందేహం లేదు. పార్టీ కూడా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ బీహార్‌లోని అరారియా లోక్‌సభ, జెహనాబాద్‌ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తేజస్వీ యాదవ్‌ రాజకీయంగా పునర్జీవం పొందారు. అరారియా సీటును ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్‌ ఆలం 55వేల మెజారిటీతో స్వాధీనం చేసుకున్నారు. జెహనాబాద్‌ అసెంబ్లీ సీటును సుజయ్‌ యాదవ్‌ 35ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. ఈ రెండు చోట్ల పాలకపక్ష జేడీయూ–బీజేపీ అభ్యర్థులను ఓడించింది. అంతేకాకుండా ప్రముఖ మహాదళిత నాయకుడు జితన్‌ రామ్‌ మాంఝీ చివరినిమిషంలో జేడీయూకు మద్దతిచ్చినప్పటికీ జెహనాబాద్‌ సీటును గెలుచుకోవడం విశేషం. ఈ పరిణామాలతో ఆయన నాయకత్వం పట్ల పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెరిగింది.

కే. చంద్రశేఖర రావు
వ్యూహ ప్రతి వ్యూహాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చక్రం తిప్పే ఈ కాలపు రాజకీయ చతురుడిగా పేరు పొందిన టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర రావు తెలంగాణలో రెండోసారి పార్టీని విజయపథాన నడిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతత్వాన మహా కూటమి బలపడుతున్న తరుణంలో తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి పక్కా వ్యూహంతో గతం కన్న ఎక్కువ సీట్లను సాధించారు. ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలతో పాటు మళ్లీ బాబు వస్తారన్న బూచీని చూపించి ఆయన మహా కూటమిని పటాపంచలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో అత్యధిక సీట్లను సాధించి ఆయన కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ 2018 సంవత్సరమంతా అవిశ్రాంతంగా పాద యాత్రలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఓదార్పు యాత్రతో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం కొన్ని ఒడిదుడుకుల తర్వాత సుస్థిర బాట పట్టింది. ఆయన తన పాద యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ వారి ప్రియతమ నాయకుడిగా ముద్రపడిపోయారు. వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో కాకుండా రాష్ట్రం నుంచి 25 లోక్‌షభ సీట్లకు జరుగనున్న ఎన్నికల్లో కూడా ఆయన ప్రభంజనం సష్టించే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు సూచించాయి. అప్పుడు జగన్‌ కూడా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించక తప్పదు. ప్రస్తుత అంచనాల ప్రకారం కేంద్రంలో పాలకపక్ష బీజేపీగానీ, కాంగ్రెస్‌ నేతత్వంలోని కూటమికిగానీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగానే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ బలంగా ఉన్న తణమూల్‌ కాంగ్రెస్, ఒరిస్సా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్‌ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను శాసించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement