'ముఖాన్ని చూసి తీర్పు ఇవ్వకండి'
పట్నా: బిహార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనపై వస్తున్న విమర్శలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి ఆదివారం బదులిచ్చారు. తన పనితీరు చూడకుండనే ముందే తీర్పు చెప్పడం సరికాదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'బ్రాండ్ బిహార్'ను మరింతగా పెంచి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గర్వకారణంగా తాను నిలుస్తానని ఆయన ప్రతిన బూనారు. బిహార్ ప్రజలు యువతపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకాకుండా.. వారికి అభివృద్ధి ఫలాలు అందిస్తానని 26 ఏళ్ల తేజస్వి చెప్పారు.
'ముఖాన్ని చూసి ముందే అంచనాకు రాకూడదు. తీయని అమృతమైనా, చేదు ఔషధమైనా దాని ప్రభావాన్ని చూపించేందుకు కొంత సమయం తీసుకుంటుంది' అని తేజస్వి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేజస్వి విద్యా అర్హతలు, రాజకీయ అనుభవంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందిస్తూ 'మా కుటుంబంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చూశాను. నాకు అనుభవం లేకపోవచ్చు కానీ ఏమీ తెలియని వాడినైతే కాను. నితీశ్ జీ నేతృత్వంలో ప్రభుత్వం పనితీరును ఇంకా బాగా నేర్చుకుంటాను. నేను అనర్హుడినని ఎలా అంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని నేను' అంటూ ఆయన విమర్శకులకు బదులిచ్చారు.