
తెలంగాణ బిల్లు ఆర్థికపరమైన బిల్లే....
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. విభజన బిల్లు ద్వారా వివిధ ప్రాంతాలకు, కొత్త రాజధానికి నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అందుకనే తెలంగాణ బిల్లు... ఆర్థికపరమైన బిల్లేనని కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు కాదని కేంద్ర మంత్రి చిదంబరం గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతం పెడుతున్న బిల్లులో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అవుతోంది. ఆర్థిక బిల్లు అవుతుందా, లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహాను కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ ముందుకు రావాల్సిన బిల్లు వెనక్కి వెళ్లింది. రేపు కూడా బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎల్లుండి గురువారం తొలుత లోకసభలో బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.