సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అనేక మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ మేరకు గోరేగావ్‌లో నివసించే కరీంనగర్ వాసి అయిన మైలారపు శంకర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము 16వ తేదీ రాత్రి లేదా 17వ తేదీ ఉదయం ఊరికి వెళ్లేందుకు ప్రైవేట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నట్లు చెప్పారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 50కిపైగా కుటుంబాలు పశ్చిమ గోరేగావ్‌లోని తీన్‌డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడ్డాయని, తామంతా కలిసి ఒకేసారి ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ కోసం యత్నిస్తే దొరకలేదని, అందుకే ఒక ఊరివారమంతా ఒకే బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన యశ్వంత్‌రావ్‌పేట్‌తోపాటు ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు..
ఒక్కరు చాలు : కరీంనగర్ జేసీ
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వలసబిడ్డలందరూ ఊళ్లకు రావల్సిన అవసరంలేదని, ఒక్కరు ఉంటే చాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ తెలిపారు. సర్వేపై ముంబైతోపాటు మహారాష్ట్రలో నివసించే ప్రజల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి గురించి ‘సాక్షి’ ఆయనకు ఫోన్లో వివరించింది. దీనిపై స్పందించిన ఆయన ముంబై, భివండీతోపాటు మహారాష్ట్రలో నివసించే జిల్లా ప్రజలందరూ స్వగ్రామాలకు రావల్సిన అవసరం లేదన్నారు. కుటుంబసభ్యుల అన్ని వివరాలు చెప్పగలిగే ఒక్కరు వస్తే చాలని, అయితే అక్కడి వివరాలను ఆధారాలతోపాటు చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
అద్దె బస్సులో.. పల్లెకు చలో..
Published Tue, Aug 12 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement