‘న్యాయవ్యవస్థ’ను గౌరవిస్తాం!
* పార్లమెంటు ఆధిక్యతా ముఖ్యమే: కేంద్రం
* జ్యుడీషియరీ అధికారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదు
* న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన విధానం కోసమే
* లోక్‌సభలో నేడు ఓటింగ్
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ.. ఆ స్థానంలో న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లులపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)-2014పై దాదాపు రోజంతా జరిగిన చర్చలో సభ్యుల నుంచి పలు సూచనలు వచ్చాయి. అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చర్చకు సమాధానమిచ్చారు.
‘మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉంది. అదే సమయంలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించే పార్లమెంటు పవిత్రత, ఆధిక్యత కూడా అంతే ముఖ్యం. న్యాయవ్యవస్థ అధికారాల విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో న్యాయమైన విధానం ఉండాలన్నది మాత్రమే మా ఉద్దేశం. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే మా ప్రయత్నం’ అని వివరించారు. రవిశంకర్ ప్రసాద్ తన సమాధానాన్ని బుధవారం ముగిస్తారు. అనంతరం ఎన్‌జేఏసీ బిల్లుతో పాటు సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లుపై సభలో ఓటింగ్ జరుగుతుంది. సభ్యులకు ప్రత్యేక సంఖ్యలను కేటాయించే ప్రక్రియ ఇంకా పూర్తి కానందున.. ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా కాకుండా.. పాత పద్దతిలో చిట్టీల ద్వారా జరిపే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఓటింగ్‌కు చాలా సమయం పట్టొచ్చు.
ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్
చర్చ సందర్భంగా న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ చేసిన సూచనకు పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. దిగువ న్యాయస్థానాల్లో ఉన్న నాణ్యమైన, ప్రతిభ కలిగిన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించేలా ‘ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్’ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మొయిలీ సూచించారు. వీటో నిబంధనను ప్రస్తావిస్తూ.. కమిషన్‌లోని ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు వ్యతిరేకిస్తే.. ఆ నియామకాన్ని నిలిపేయడం అప్రజాస్వామికమన్నారు. కమిషన్‌లోని ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండేలా బిల్లులో మార్పు చేయాలన్నారు.
‘ప్రఖ్యాత వ్యక్తి’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని సూచించారు. ‘నిబంధనల్లో నిర్వచనం లేకపోతే.. అంతా ప్రముఖులే అవుతారు’ అని మొయిలీ వ్యాఖ్యానించారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తదితరులు కోరారు. కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా చేసిన వ్యాఖ్యలను అప్నాదళ్ సభ్యురాలు అనుప్రియ సింగ్ పటేల్ ప్రస్తావించారు. పార్లమెంటు ప్రతిష్టను తక్కువ చేసే ఉద్దేశంతో కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె విమర్శించారు. చర్చపై సమాధానమిచ్చిన రవిశంకర్ ప్రసాద్.. ఈ బిల్లుపై న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీలతో వీలైనంత విస్తృతంగా సమాలోచనలు జరిపామన్నారు. కొలీజియం వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని సాక్షాత్తూ దివంగత న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మనే అభిప్రాయపడ్డారని తెలిపారు.
రాజ్యసభలో కష్టమే
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన బిల్లుపై రాజ్యసభలో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. బిల్లులోని వీటో నిబంధనలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే రెండు మూడు ప్రతిపాదనలను మార్చాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. కమిషన్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా సభ్యుడు కనుక ఏదైనా నియామకంపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేస్తే.. ఆ నియామకం నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో కాంగ్రెస్ నేత హెచ్చరించారు.