లోక్‌సభలో ‘జ్యుడీషియల్’ బిల్లు | Govt introduces bills to scrap collegium system in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో ‘జ్యుడీషియల్’ బిల్లు

Published Tue, Aug 12 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

లోక్‌సభలో ‘జ్యుడీషియల్’ బిల్లు

లోక్‌సభలో ‘జ్యుడీషియల్’ బిల్లు

కమిషన్‌లో ఆరుగురు సభ్యులు సీజేఐ నేతృత్వం
 
న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ.. ఆ స్థానంలో ఆరుగురు సభ్యుల న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్- ఎన్‌జేఏసీ)’ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్‌జేఏసీని, దాని కూర్పును రాజ్యాంగంలో చేర్చడానికి ఉద్దేశించిన ‘రాజ్యాంగ సవరణ(121వ సవరణ) బిల్లు-2014’తో పాటు ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లు-2014’ను కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కమిషన్ అనుసరించాల్సిన విధివిధానాలను ఎన్‌జేఏసీ బిల్లులో పొందుపర్చారు.

బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వం వహిస్తారు. ఇద్దరు  సుప్రీంకోర్టు జడ్జీలు, సుప్రసిద్ధులైన ఇద్దరు వ్యక్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు సాధారణ చట్టం ద్వారా ఎన్‌జేఏసీ కూర్పును మార్చే అవకాశం లేకుండా.. కమిషన్ కూర్పునకు రాజ్యాంగబద్ధత కల్పిస్తున్నారు. కమిషన్‌లోని ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులను సీజేఐ, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిషన్ ఎంపిక చేస్తుంది. ఆ ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లేదా మహిళావర్గానికి చెందినవారై ఉంటారు. ఆ ప్రసిద్ధ వ్యక్తులు మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. వారికి మరోసారి నామినేట్ అయ్యే అవకాశం ఉండదు.

యూపీఏ నాటి బిల్లు ఉపసంహరణ

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మోడీ సర్కారు నూతనంగా మరో బిల్లును రూపొందించిన నేపథ్యంలో.. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్, 2013’ను ప్రభుత్వం సోమవారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. సంబంధిత స్థాయీసంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ దీని స్థానంలో కొత్త బిల్లును తీసుకొస్తామని  కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభకు తెలిపారు. ఈ అంశంపై రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెడతామన్నారు. అయితే, తమ హయాంలో తీసుకొచ్చిన బిల్లును తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పుబట్టారు. మార్పుచేర్పుల కోసం సవరణలు చేస్తే సరిపోతుందని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement