లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ ఉన్నతాధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మీరట్‌లో ప్రార్థనల అనంతరం ఓ వర్గం వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టిన తర్వాత జిల్లా ఎస్పీ అఖిలేశ్ నారాయణ సింగ్ ముస్లింలు అధికంగా ఉన్న వీధుల్లో నడుస్తూ భద్రతను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఓ వీధిలో ముగ్గురు ముస్లింలు ఎదురవగా, ఎస్పీ వారితో మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. వారు నమాజ్ చేయడానికని సమాధానమిచ్చారు. తిరిగి ఎస్పీ అది మంచిదే. కానీ, నల్లరంగు, నీలి రంగు బ్యాడ్జిలు ధరించిన వాళ్లకు చెప్పండి. ఇక్కడ ఉండడానికి ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపొమ్మని. ఇక్కడ ఉంటూ, ఇక్కడి తిండి తింటూ వేరే వాళ్లను పొగడుతారా? అని మండిపడ్డారు. దీనికి మీరు చెప్పింది కరెక్టు సార్ అని ముగ్గురిలో ఒకరు బదులిచ్చారు.
తర్వాత ఎస్పీ వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తానంటూ హెచ్చరించారు. ఈ సన్నివేశమంతా వీడియోలో రికార్డయింది. ఈ విషయంపై ఓ జాతీయ మీడియా ఎస్పీని సంప్రదించగా.. ‘సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్బంగా కొంతమంది యువకులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. వాళ్లను చూద్దామని మేం అక్కడికి వెళ్లాం. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలవి’ అని వివరణనిచ్చారు. కాగా, యూపీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మీరట్‌లోనే ఎక్కువ మంది చనిపోయారు. చదవండి : గ్రేట్ సీఎం.. వారిపై యోగి కార్యాలయం ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment