రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకుంటున్న సిరివెన్నెల.. కోవింద్‌ను ఆశీర్వదిస్తున్న తిమ్మక్క
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్‌లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది.
రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు
అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్‌లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్
అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్‌లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు.
దృఢసంకల్పానికి ప్రతీక
కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment