ఆ నలుగురు... 25 లక్షల సాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా నగరవాసులు చెంబు పట్టుకొని బహిర్భూమికి వెళ్లడం చూసి కదిలిపోయాడు బోస్నియా అంబాసిడర్ సాబిత్ సుబాసిక్. వర్ధమాన దేశం భారత్‌లో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏమిటని ఆశ్చర్యపోయారు. దీన్ని నిర్మూలించేందుకు తన వంతు సాయం చేయాలనుకున్నారు. మరుగుదొడ్డి సౌకర్యం లేని పేదవారికి ఆ సౌకర్యాన్ని కల్పించాలనుకున్నారు. అందుకు మదిలో ఓ ఆలోచన మెదిలింది. దాన్ని అమలు చేసేందుకు సెర్బియా, గౌతమాల, చిలీ అంబాసిడర్లను (వ్లాదిమీర్ మిరిక్, ఆండ్రెస్ బార్బ్, జార్జెస్ డీ లా రోచెస్) కలిశారు.
భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దౌత్యవేత్తల మధ్య టెన్నిస్ టౌర్నమెంట్‌ను నిర్వహించాలని, దాని ద్వారా వీలైనంత మేరకు డబ్బు సేకరించాలని నలుగురు అంబాసిడర్లు నిర్ణయించారు. అనుకున్నట్లుగానే అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ సహకారంతో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ టోర్నమెంట్‌ను ఢిల్లీ నగరంలోని ఆర్‌కే ఖన్నా స్టేడియంలో విజయవంతంగా నిర్వహించారు. వారు ఊహించని విధంగా స్పాన్సర్‌షిప్‌లు, విరాళాల రూపంలో 25 లక్షల రూపాయలు వచ్చాయి. దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం కషి చేస్తున్న ఎన్జీవో సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ సహకారం కూడా తీసుకున్నారు.
ఈ పాతిక లక్షల రూపాయలను పేదల మరుగుదొడ్ల నిర్మాణం కోసం తాము వెచ్చిస్తామని బోస్నియా అంబాసిడర్ సాబిత్ మీడియాకు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలకు ఎక్కువగా టెన్నిస్ ఆడడం వచ్చుకనుక తాము విరాళాల కోసం ఈ ఆటను ఎంచుకున్నామని చెప్పారు. మరుగుదొడ్ల సమస్య పట్ల విదేశీ దౌత్యవేత్తల మధ్య అవగాహన పెంచడం కూడా తమ ఈ ఆట ఉద్దేశమని అన్నారు. భవిష్యత్‌లో ఫుట్‌బాల్, క్రికెట్ లాంటి ఆటల పోటీలు కూడా నిర్వహించి మరగుదొడ్ల కోసం విరాళాలు సేకరిస్తామని ఆయన తెలిపారు.