
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలోని బీఎస్‌ఎఫ్ క్యాంప్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అయితే ఉగ్రవాదుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఏఎస్‌ఐ కన్నుమూశాడు.
బాంబులతో దాడి..
గోగోల్యాండ్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టును ఆనుకుని ఉన్న బీఎస్‌ఎఫ్ 182 బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లోకి మంగళవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారని, ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ బీకే యాదవ్(50) మరణించగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్‌పీ వైద్ చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు బాంబులను పెట్టి ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు
. ఘటనపై కశ్మీర్ రేంజ్ ఐజీ మునీర్‌ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మీ దుస్తుల్లో సమీప నివాస గృహాల నుంచి కంచెను కత్తిరించి ఉగ్రవాదులు లోనికి ప్రవేశించినట్టు చెప్పారు. జైషే ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారా అని ప్రశ్నించగా.. ఇటువంటి దాడులకు పాల్పడేది ఆ గ్రూప్ ఒక్కటే అని ఆయన తెలిపారు. ఈ గ్రూపులో ఇంకా ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని, వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని గుర్తించామని చెప్పారు.
నిలిచిన విమాన సేవలు: ఉగ్ర దాడి నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమానయాన సేవలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం పది గంటల తర్వాత సేవలను పునరుద్ధరించారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామే అని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటిం చుకుంది. శ్రీనగర్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు.
పూంచ్‌లో జవాన్ మృతి: పూంచ్ జిల్లాలో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఎదురుకాల్పుల్లో జవాన్ నాయక్ మహేంద్ర చెమ్‌జంగ్(35) మరణించారు. క్రిష్ణ ఘాటి సెక్టార్‌లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగడంతో భారత సైనికులు దీటుగా బదులిచ్చారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment