
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర దాడి
ఏడుగురు యాత్రికుల దుర్మరణం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఘటన
► 32 మందికి గాయాలు.. మృతులంతా గుజరాత్‌కు చెందినవారే
► జమ్మూ–శ్రీనగర్ హైవేలో మొదట పోలీసు బంకర్‌పై ఉగ్రవాదుల కాల్పులు
► గట్టిగా తిప్పికొట్టిన పోలీసులు.. తర్వాత యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి
► ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్, జైట్లీ ఖండన
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర నెత్తురోడింది. పవిత్ర హిమలింగాన్ని శంభోహరహర అంటూ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వస్థలానికి పయనమైన అమాయక భక్తులపై ఉగ్రవాద రక్కసి పంజా విసిరింది. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి.
సోమవారం రాత్రి 8.20 గంటలకు ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. తర్వాత ముష్కరులు ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డారు. అక్కడా పోలీసులు గట్టిగా తిప్పికొట్టారు. ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతుండగా అక్కడికొచ్చిన యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. బస్సు అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యాత్రికులను తీసుకుని సోనామార్గ్ నుంచి జమ్మూ వెళ్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులెవరూ గాయపడలేదు.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి..
దాడికి గురైన బస్సు అమర్‌నాథ్ యాత్రికుల వాహనశ్రేణిలో భాగం కాదు కనుక దానికి భద్రత కల్పించలేదని పోలీసులు తెలిపారు. ‘హైవేపై రాత్రి 7 గంటల నుంచి భద్రతను ఉపసంహరిస్తారు కనుక ఆ సమయం తర్వాత రోడ్డుపై యాత్రికుల బస్సులు రాకూడదన్న యాత్ర నిబంధనలను బస్సు డ్రైవర్ ఉల్లంఘించాడు. జీజే09జెడ్ 9976 నంబరున్న ఈ బస్సు అమర్‌నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేసుకోలేదు. సీఆర్‌పీఎఫ్ విస్తృత రక్షణ కల్పించే వాహన శ్రేణిలో ఇది భాగం కాదు. విడిగా వచ్చింది’ అని తెలిపారు.
ఈ ఘటనతో జమ్మూ–శ్రీనగర్ హైవేను మూసేసి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భద్రతా బలగాలు హతమార్చిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడొచ్చన్న అనుమానంతో అధికారులు శని, ఆదివారాల్లో అమర్‌యాత్రను నిలిపేసి సోమవారం తిరిగి ప్రారంభించారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాలు సంయుక్తంగా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రికులపై 2000 ఆగస్టు 1న పహల్గావ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని బలితీసుకున్నారు.
భారత్ బెదరదు: మోదీ
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికులపై దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు. ‘శాంతియుతంగా సాగుతున్న యాత్రపై ఉగ్రవాదుల పిరికిపంద దాడి మాటలకందని బాధ కలిగించింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులు, ద్వేషపూరిత దుష్ట పన్నాగాలకు భారత్ ఎన్నటికీ బెదరబోదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. ఓహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీలతో మాట్లాడానని, అవసరమైన సాయమంతా అందిస్తానని హామీ ఇచ్చానని వెల్లడించారు. దాడి అత్యంత గర్హనీయమని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న తమ సంకల్పాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్.. ఓహ్రా, ముఫ్తీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. యాత్రకు గట్టి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదులు కశ్మీర్ సంప్రదాయాలు, విలువలపై దాడి చేశారని ముఫ్తీ మండిపడ్డారు. దాడిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ఖండించారు.
ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్/న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముగ్గు రు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆదివారం తమ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు చనిపోయారని, రెండు బంకర్లను ధ్వంసం చేశామన్న పాక్ వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత సైనికులు తీవ్రంగా గాయపడినా, చనిపోయినా దేశ ప్రజలకు తెలియజేసే జవాబుదారీతనం తమకు ఉందని స్పష్టం చేశారు.