
ఉగ్రదాడి: కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రెండ్రోజుల పాటు విద్యాసంస్థలు కూడా మూసివేయనున్నారు. అయితే అమర్‌నాథ్ యాత్ర మాత్రం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. జమ్ము నుంచి పలు యాత్రికుల బృందాలు అమర్‌నాథ్ బయలుదేరాయి. నేటి నుంచి పటిష్ట భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచే భద్రతా బలగాలు జుమ్ముకు చేరుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు దాడికేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో నిన్న ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది యాత్రికులు గాయపడ్డ విషయం తెలిసిందే. మృతులంతా గుజరాత్ వాసులని సమాచారం. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.