థానే అమ్మాయికి అమెరికా ఆహ్వానం..
మహరాష్ట్రః ముంబై కాలేజీలో చదువుతున్న విద్యార్థినికి ఆమెరికా ఆహ్వానం పలికింది. వచ్చే సంవత్సరం వాషింగ్టన్ లో జరగనున్న కార్యక్రమానికి థానెకు చెందిన విద్యార్థిని ఓయిషికా ఎంపికైంది. దీంతో రానున్న ప్రెసిడెన్షియల్ ప్రారంభోత్సవ లీడర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపింది.
మహరాష్ట్ర థానెకు చెందిన పదహారేళ్ళ ఓయిషికా నియోగి... ముంబై కాలేజీలో చదువుకుంటోంది. తన తల్లి చుమ్కీ నియోగి తో పాటు థానే మీరా రోడ్ శివారు ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం ముంబై మలాద్ లోని బికె గాడియా జూనియర్ కాలేజీలో సైన్స్ గ్రూప్ లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఓయిషికా... కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పాల్గొనే యువ ప్రపంచ సదస్సులో భారత్ కు ప్రాతినిథ్యం వహించనుంది. 2017లో వాషింగ్టన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అతి పిన్న నోబెల్ గ్రహీత, పాకిస్తానీ అమ్మాయి, విద్యా కార్యకర్త మలాలా, ఆమె తండ్రి జియావుద్దీన్ కూడ ఇతర ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. వారందరినీ కలిసే అవకాశం తనకు రావడంపట్ల ఓయిషికా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఓ అద్భుతమైన వక్త, యువ మేధావి కావడంతోనే ఆమెకు ఈ అరుదైన అవకాశం వచ్చిందంటూ బికె గాడియా కాలేజ్ ప్రిన్సిపాల్ అరుంధతి ఓయిషికాను ప్రశంసించారు.
ఓయిషికా కలకత్తాలో పుట్టింది. హైదరాబాద్ లో జరిగిన హార్వర్డ్ యునైటెడ్ నేషన్స్ పోటీలో రాణించిన ఆమె... అనంతరం జూన్ 2015 లో అమెరికా గ్లోబల్ యంగ్ లీడర్స్ సదస్సు డిక్లమేషన్ పోటీలోనూ గెలిచింది. తరువాతే ఆమెకు ఈ సదవకాశం వచ్చింది. అంతర్జాతీయ సంబంధాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు... మోడల్ చర్చల్లో పాల్గొని ప్రత్యేకంగా ప్రపంచ ప్రేక్షకులముందు వాటిని బహిర్గతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి మోడల్ యునైటెడ్ వేదిక రూపొందించింది. బి. కె. గాడియా జూనియర్ కళాశాల కు చెందిన డి.జి కేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి మాక్ డిబేట్ నిర్వహిస్తుంది. అందులో గెలిచిన ఓయిషికా గత సంవత్సరం హైదరాబాద్ పోటీలో రాణించి, అనంతరం వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ ల్లో జరిగిన గ్లోబల్ యూత్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ కు కూడ హాజరైంది. అయితే ప్రస్తుతం అమెరికా ఆహ్వానంమేరకు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ సమ్మిట్ కు హాజరు కాబోతోంది. తనకు బరాక్ ఒబామా, మిచెల్లె లు కూడ ఎంతో ఆరాధ్యులని, వారిని కూడ ఎప్పుడోప్పుడు కలుస్తానని ఈ సందర్భంగా చెప్తోంది.
రానున్న ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, అలా జరిగితే వైట్ హౌస్ లో మొదటి మహిళా అధ్యక్షురాలుగా హిల్లరీది చారిత్రక విజయమౌతుందని, ఆమె ఓ మంచి నాయకురాలుగా వర్థిల్లుతుందన్న నమ్మకం కూడ తనకు ఉందని ఓయిషికా చెప్తోంది. అయితే డోనాల్డ్ ట్రంప్ కాస్త దూకుడు మనిషి అయినా ఆమెరికన్లు ఆయన్ను ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తోందని, చాలాకాలం ప్రశాంతంగా కొనసాగిపోవడంతో ఇప్పుడు కాస్త దూకుడు కావాలన్న దృష్టిలో అమెరికన్లు ఉన్నారని అంటోంది. భవిష్యత్తులో టెలివిజన్ మీడియా ప్రొఫెషనల్ కావాలనుకుంటున్న ఓయిషికా.. ఐక్యరాజ్య సమితిలో మీడియా ప్రతినిధిగా పనిచేయాలని కలలుగంటోంది. ప్రపంచ వ్యవహారాల్లో జ్ఞానాన్ని సముపార్జించడమేకాక, వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ థియేటర్, పెయింటింగ్ వంటి వాటిలో కూడ ఓయిషికా శిక్షణ పొందుతోంది.