డేరా బాబా గుర్మీత్‌కు శిక్ష వెనక ఆ 8 మంది.. | that 8 persons behind baba gurmit singh convicted | Sakshi
Sakshi News home page

డేరా బాబా గుర్మీత్‌కు శిక్ష వెనక ఆ 8 మంది..

Published Tue, Aug 29 2017 7:18 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

డేరా బాబా గుర్మీత్‌కు శిక్ష వెనక ఆ 8 మంది..

డేరా బాబా గుర్మీత్‌కు శిక్ష వెనక ఆ 8 మంది..

సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు అత్యాచారం కేసుల్లో దాదాపు 15 ఏళ్ల ఆలస్యంగానైనా 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష పడడానికి ఎనిమిది మంది ప్రాణాలకు తెగించి పోరాడడమే కారణం. 
 
1. ఇద్దరు సాధ్వీలు
డేరా సచ్ఛా సౌధాలో ఉంటున్న ఓ సాధ్వీ తనపై బాబా అత్యాచారం జరిపాడంటూ అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి పేరిట 2002లో ఆకాశరామన్న లేఖ రాశారు. ఆ లేఖను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటాగా తీసుకొని సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తులో లేఖ రాసిన సాధ్వీతోపాటు మరో సాధ్వీ బాబా బెదిరింపులకు భయపడకుండా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను సీబీఐ అధికారులకు వివరించారు. మరో 40 మంది సాధ్వీలపై కూడా బాబా అత్యాచారం జరిపారంటూ వారు ఆరోపించారు. అయితే ఆ విషయాన్ని అంగీకరించేందుకు ఇతర సాధ్వీలు ఎవరూ ముందుకు రాలేదు. బాబాపై కేసు నమోదయ్యాక ఏళ్లపాటు, వందల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ఇద్దరు సాధ్వీలు అధికారుల ముందు, కోర్టుల ముందు సాక్ష్యాలు చెబుతూ వచ్చారు. 
 
2 రంజిత్‌ సింగ్‌
అత్యాచారానికి గురైన ఓ సాధ్వీకి స్వయాన అన్న. డేరా సచ్ఛా సౌధాలో అప్పుడు ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆకాశరామన్న పేరిట లేఖ తానే రాసి అది ఓ స్థానిక పత్రికలో ప్రచురితమయ్యేలా చేశారు. లేఖ విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే రంజిత్‌ సింగ్‌ హత్యకు గురయ్యారు. అది కూడా బాబా రామ్‌ రహీమ్‌ సింగ్‌ చేయించారన్న ఆరోపణపై కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
3. రామ్‌చందర్‌ ఛత్రపతి
హర్యానా నుంచి వెలువడుతున్న స్థానిక పత్రిక ‘పూరా సచ్‌’ పత్రిక సంపాదకుడు. సాధ్వీకి జరిగిన అన్యాయం గురించి ఆకాశరామన్న పేరిట రంజిత్‌ సింగ్‌ రాసిన లేఖను ప్రచురించారు. ఈ లేఖనే హైకోర్టు సుమోటాగా తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆయన ఇంటివెలుపల 2002లో మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతినిపై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలతో 28 రోజులపాటు ఢిల్లీ ఆస్పత్రిలో మత్యువుతో పోరాడి మరణించారు. తనపై దాడికి కుట్ర పన్నింది బాబానేనంటూ ఆయన తన మరణ వాంగ్మూలంలో ఆరోపించారు. 
 
4. అంశూల్‌ ఛత్రపతి
జర్నలిస్ట్‌ రాంచందర్‌ ఛత్రపతి కుమరుడు. 21వ ఏట తండ్రిని పోగొట్టుకున్న అంశూల్‌ తన తండ్రి నమ్ముకున్న విలువల కోసం పోరాటం సాగించారు. తన తండ్రి హత్యతోపాటు బాబా డేరాలో జరుగుతున్న చీకటి కార్యకాలపాలపై దర్యాపు జరపాల్సిందిగా ఇటు సీబీఐ, అటూ హైకోర్టు చుట్టూ తిరిగారు. తన తండ్రి ప్రచురించిన సాధ్వీ లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖనే కోర్టు సుమోటాగా స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2003లో కేసు దర్యాప్తులో భాగమైన ఆయన సిబీఐ విచారణకు సహకరిస్తూ వచ్చారు. 
 
5. జడ్జీ జగ్దీప్‌ సింగ్‌
జడ్జీ జగ్జీప్‌ సింగ్‌ ఎన్ని వర్గాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లొంగకుండా, తానిచ్చే తీర్పు కారణంగా తనకు, తన కుటుంబానికి హాని కలిగే ఆస్కారం ఉందని తెలిసి కూడా నిర్భయంగా నిజాయితీగా కేసు విచారణ జరిపి దోషికి తగిన శిక్ష విధించారు. తనకంటూ ప్రత్యేక ప్రచారం కోరుకోని ముక్కుసూటి వ్యక్తి ఆయన. హర్యానాలోని జింద్‌కు చెందిన ఆయన పంజాబ్‌ యూనివర్శిటీలో లా చదివారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో లిటిగేటర్‌గా వత్తిని ప్రారంభించారు. 2012లో హర్యానా జుడీషియల్‌ సర్వీసులో చేరారు. 2016లో సీబీఐ కోర్టుకు జడ్జీగా నియమితులయ్యారు. అదే ఏడాది ఓ రోజు తాను కారులో వెళుతుండగా ఓ యాక్సిడెంట్‌ జరిగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తన కారాపి అంబులెన్స్‌కు కాల్‌ చేశారు. అంబులెన్స్‌ సకాలంలో వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయనే స్వయంగా తన కారులో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు మొదటిసారిగా ప్రజలకు ఆయన పేరు పరిచయం అయింది. 
 
6. పోలీసు డీఐజీ ములింజా నారాయణన్‌
పంజాబ్, హర్యానా హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించినప్పుడు ములింజా నారాయణన్‌ ఢిల్లీలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (స్పెషల్‌ క్రైమ్స్‌)కు పని చేస్తున్నారు. ఆయన ఈ కేసు విచారణను పర్యవేక్షించారు. ఈ కేసును త్వరగా కొట్టివేయాల్సిందిగా పలువురి నుంచి తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని అప్పట్లో ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు బాబాకు శిక్ష పడిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచే కాకుండా తన పోలీసు అధికారుల నుంచి కూడా కేసును మూసివేయాల్సిందిగా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిపారు. ఆయన 2009లో పదవీ విరమణ చేశారు. 
 
7. మాజీ సీబీఐ డైరెక్టర్‌ విజయ్‌ శంకర్‌
ఈ కేసులో 2007లో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు విజయ్‌ శంకర్‌ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసును నీరుగార్చాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ నాయకుల నుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయని ఆయన కూడా తెలిపారు. దర్యాప్తు సందర్భంగా ఓసారి పంచకులలోని సీబీఐ కార్యాలయాన్ని డేరా సచ్ఛా కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసులు సకాలంలో రావడం వల్ల ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. 

8. గుర్మీత్‌ పారిపోయే ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
తన బ్లాక్‌ కమాండో భద్రతతోపాటు తన ప్రైవేటు సెక్యూరిటీతో పంచకులలోని సెక్టార్‌ వన్‌ కోర్టు కాంప్లెక్స్‌కు కారులో వచ్చిన గుర్మీత్‌ సింగ్‌ తనను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తారని గ్రహించి ప్రైవేటు సెక్యూరిటీ సాయంతో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సకాలంలో గ్రహించిన హర్యానా పోలీసులు, పారా మిలటరీ దళాలు సింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  బ్లాక్‌ కమాండోలతో పెనుగులాట కూడా జరిగింది. ప్రైవేటు సెక్యూరిటీలో ఒకరు పోలీసులపైకి కాల్పులు కూడా జరిపారు. అయినా పోలీసులు భయపడకుండా తమ విధులను నిర్వర్తించారు. బాబా కోర్టు కాంప్లెక్స్‌ దాట గలిగితే పారిపోయే అవకాశం ఉండేది. ఎందుకంటే కోర్టు చుట్టూ వేలాది మంది ఆయన అనుచరులు గుమిగూడి ఉన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement