
క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ప్రారంభం
‘మోర్ముగావో’ను ఆవిష్కరించిన నేవీ చీఫ్ భార్య రీనా
ముంబై: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘మోర్ముగావో’ను శనివారం ప్రారంభించారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ఈ నౌకను ఉదయం 11.50 గంటలకు ప్రారంభించి.. అరేబియా సముద్రంలోకి వదిలారు. ఎండీఎల్ తయారు చేసిన ఈ క్షిపణి నాశక నౌక ప్రపంచంలో ఉన్న అత్యాధునిక యుద్ధనౌకలతో సమానంగా పనిచేస్తుందని లాంబా తెలిపారు.
అత్యాధునిక స్టెల్త్ డెస్ట్రాయర్‌ను అమర్చారన్నారు. దీన్ని విశాఖపట్నంలోని ఎండీఎల్‌లో 15బీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారన్నారు.రూ. 29,700 కోట్లతో 15బీ నౌకల అభివృద్ధికి 2011లో కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం క్లాస్ కింద తొలి క్షిపణి నాశక నౌకను కిందటేడాది ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఈ నౌకలో ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్లే క్షిపణులు, ఉపరితలం నుంచి గగనంలో దూసుకెళ్లే క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి. 2020-24 మధ్య ఇలాంటి మరో 4 విధ్వంసక నౌకలను నిర్మిస్తామని ఎండీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 1960 నుంచి భారత నేవీ, ఎండీఎల్‌లు నౌకలను నిర్మిస్తున్నాయి.
‘స్కార్పీన్’ లీకు ఫ్రాన్స్‌లో... సంచలనం సృష్టించిన స్కార్పీన్ జలాంతర్గాముల రహస్య పత్రాలు బహిర్గతమైంది ఫ్రాన్స్ రక్షణ విభాగ సంస్థ డీసీఎన్‌ఎస్‌లోనని, భారత్‌లో కాదని దర్యాప్తులో తేలినట్టు లాంబా చెప్పారు.