న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి దశ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. మలి దశ సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2తో ముగుస్తాయి. జనవరి 31న ప్రారంభమైన తొలి దశలో భాగంగా లోక్‌సభ ఏడుసార్లు, రాజ్యసభ ఎనిమిది సార్లు సమావేశమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఇరు సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ పూర్తయిందని, లోక్‌సభ సమావేశాలు 113 శాతం, రాజ్యసభ సమావేశాలు 97 శాతం ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
మొదటి దశ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో పాటు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు, పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు, స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల బిల్లు, ఐఐఎం బిల్లు, రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వీటిలో పేమెంట్ ఆఫ్ వేజెస్ బిల్లును ఇరు సభలు ఆమోదించాయి.