ధర్నాలా.. అభివృద్ధా?
- ఏది కావాలో తేల్చుకోండి: మోదీ
- బీజేపీ పాలిత రాష్ట్రాలను చూడండి
- మాకే పూర్తి మెజారిటీ ఇవ్వండి
‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూడండి.. కమలానికే పట్టం కట్టండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీకి బాధ్యతాయుత ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీ సమస్యలను పక్కనపెట్టి.. టీవీలు, మీడియాలో కనిపించేందుకు ధర్నాలు చేసేవారితో ప్రయోజనమేమీ ఉండదని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. సమస్యల నుంచి పారిపోయేవారిని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వారిని దూరంగా ఉంచాలని కోరారు. కిందటి ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ ఇవ్వకపోవడంతో ఏడాది కాలం వృథా అయిందని, ఈసారి అలా కాకుండా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలన్నారు.
మోదీ అదృష్టం కారణంగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపైనా మోదీ తనదైన శైలిలో స్పందించారు. ‘‘వాళ్లు చెబుతున్నదే నిజమనుకుందాం. మీకు అదృష్టవంతులు కావాలా..? దురదృష్టవంతులా? నా అదృష్టం కారణంగా మీకు ధరలు తగ్గితే మంచిదేగా. మోదీ అదృష్టం దేశానికి ఉపయోగపడుతుందంటే ఇంతకు మించిన అదృష్టం మరేమీ ఉంటుంది? ఇక దురదృష్టవంతులను తీసుకురావాల్సిన అసరమేముంది? ’’ అని ప్రశ్నించారు.
నినాదాలు చేసేవారు, తప్పుడు హామీలు ఇచ్చేవారు బీజేపీకి వ్యతిరేకంగా తెరవెనక బేరసారాలు చేస్తుంటారని ఆరోపించారు. కిందటిసారి ఆప్, కాంగ్రెస్ తెరవెనుక చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మీడియాలో కనిపించేందుకు వారే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అమాయకపు ముఖాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉంటే సీఎంకు.. తనపైన ఉండే మోదీ, కేంద్ర ప్రభుత్వం భయం ఉంటుందన్నారు. అలాకాకుండా వేరేవారికి పీఠం అప్పగిస్తే.. ఆయనపైన ఎవరూ ఉండరని, ఢిల్లీని ఇంకాస్త వెనక్కు తీసుకువెళ్తారని చెప్పారు.