తరలింపు ముమ్మరం
- యెమెన్ నుంచి మరో 800 మంది భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: రెబెల్స్‌కు, అరబ్ దేశాల కూటమికి మధ్య దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న యెమెన్ నుంచి భారత్ శనివారం మరో 800 మంది భారతీయులను తరలించింది. దీంతో యెమెన్ నుంచి బయటపడిన భారతీయుల సంఖ్య 1,800కు చేరింది. శనివారం యెమెన్ రాజధాని సనా నుంచి రెండు ఎయిరిండియా విమానాల్లో 350 మంది భారతీయులు పొరుగు దేశమైన జిబౌతి చేరుకున్నారు. యెమెన్‌లోని ఆడెన్ పోర్టుకు దగ్గర్లో భారత నౌక ఐఎన్‌ఎస్ ముంబైని మోహరించారు.
ఆడెన్‌లో బాంబు దాడుల వల్ల అక్కడి భారతీయులను చిన్నచిన్న పడవల్లో ఈ నౌకలోకి చేరుస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. చిన్నచిన్న విమానాల్లోనూ భారతీయులను ఇందులో చేరుస్తున్నారని అధికారులు వెల్లడించారు. యెమెన్ నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 86 మంది ఉన్నారు. ఆడెన్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 185 మంది చనిపోయారని సమాచారం.