సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆయన అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. గత నెల 30వ తేదీన జరిగిన కార్యక్రమంలో 39 ప్రముఖులు అవార్డులు అందుకోగా, గురువారం మొత్తం 44 మందికి సంబంధించి అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో 40 మంది రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ముగ్గురికి వారు మరణించిన తర్వాత జ్ఞాపకార్థం అవార్డులను ప్రకటించగా, వారి తరఫు బంధువులు స్వీకరించారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన కన్నడ నిఘంటుకర్త జి.వెంకటసుబ్బయ్య వేడకకు హాజరుకాలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత శిల్పి ఎక్కా యాదగిరిరావు, ప్రముఖ వైద్యుడు డా.మహమ్మద్ అబ్దుల్ వాహీద్, పోచంపల్లి పట్టుచీరలను నేయడంలో సమయం, కష్టం తగ్గించేలా ‘లక్ష్మీ ఆసు’ యంత్రం సృష్టించిన చింతకింది మల్లేశం, టెలికాం నిపుణుడు త్రిపురనేని హనుమాన్ చౌదరిలు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్నారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, గాయకుడు కేజే ఏసుదాసులకు పద్మ విభూషణ్ అవార్డులను ప్రణబ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ‘మోహన్ వీణ’ సంగీత వాద్యాన్ని రూపొందించిన పండిట్ విశ్వమోహన్ భట్, ఆధునిక భాషల అధ్యాపకుడు, కాశీ విశ్వనాథ్ గుడిలో ఆచార్యుడైన దేవీ ప్రసాద్ ద్వివేదీ, జైనమత సాధువు రత్నసుందర్‌సూరి మహరాజ్ తదితరులు పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. దివంగత పాత్రికేయుడు చో రామస్వామికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించగా, ఆయన భార్య స్వీకరించారు. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్, గాయకుడు కైలాష్ ఖేర్, బాలీవుడ్ సినిమాల విమర్శకురాలు భావనా సోమయ తదితరులకు పద్మశ్రీ అవార్డులను ప్రణబ్ బహుకరించారు.
అమరవీరులకు అవార్డు అంకితం: ఎక్కా యాదగిరి
తాను అందుకున్న పద్మ శ్రీ పురస్కారాన్ని తెలంగాణ అమర వీరులకు అంకిత ఇస్తున్నట్టు ఎక్కా యాదగిరి తెలిపారు. అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పురాస్కారానికి తనను ఎంపిక చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో శిల్ప కళను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శిల్ప కళా అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మరో అవార్డు గ్రహీత, చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. చేనేత కార్మికుడైన తనను పుస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన ఆసు యంత్రాలు ఇంకా కింది స్థాయి వరకు చేరలేదని, 90 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఆనందంగా ఉందన్నారు.
ప్రముఖులకు రాష్ట్రపతి పద్మ అవార్డులు
Published Thu, Apr 13 2017 9:38 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
Advertisement