అమలకు నారీ శక్తి అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటి అక్కినేని అమలకు నారీ శక్తి పురస్కారం లభించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా అందించే ఈ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 33 మంది మహిళలకు రాష్ట్రపతి నారీశక్తి పురస్కారాలను అందజేశారు.
వ్యక్తిగత సమాజ సేవకు గుర్తింపుగా అమలకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవార్డుతో సమాజ సేవలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. సమాజ సేవకు తాను చేస్తున్న కృషికి తన కుటుంబం నుంచి అందుతున్న సాయం ఎంతో ఉందన్నారు. వివిధ రంగాల్లో మరింత సాయం చేయడానికి తన వద్ద ప్రణాళిక ఉందని, దీన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు అందించి తన భవిష్యతు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె తెలిపారు.