ముక్కుకు ముక్కు రాసి.. | Ceremony concludes with traditional rubbing of noses in friendship between | Sakshi
Sakshi News home page

ముక్కుకు ముక్కు రాసి..

Published Sun, May 1 2016 7:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

ముక్కుకు ముక్కు రాసి..

ముక్కుకు ముక్కు రాసి..

న్యూజిలాండ్‌లో  ప్రణబ్‌కు సంప్రదాయ స్వాగతం
 
 అక్లాండ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన కోసం శనివారం న్యూజిలాండ్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక సంప్రదాయం ప్రకారం మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో పరస్పరం ముక్కు రాసుకున్నారు. తొలుత గవర్నర్ జనరల్ సర్ జె ర్రీ మట్‌పరే నివాసానికి చేరుకున్న ప్రణబ్‌ను ఆచారం ప్రకారం అతిథి శత్రువో, స్నేహితుడో తెలుసుకోవడానికి మవోరి యుద్ధవీరులు అడ్డుకున్నారు. ఓ అత్యున్నత అధికారి దీని గురించి ప్రణబ్‌కు వివరిస్తుండగా యుద్ధవీరులు కేకలు వేశారు. ప్రణబ్‌కు ముందు ఓ చెట్టుకొమ్మ అందించారు. అతిథి దాన్ని అందుకుంటే వారు అతడిని స్నేహితుడిగా అంగీకరించి అక్కడి నుంచి తప్పుకుంటారు.

ప్రణబ్ ముఖర్జీ  సహాయకుడు ఆ కొమ్మను అందుకుని ఆయనకు అందించాక యుద్ధవీరులు ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో ప్రణబ్ ముక్కు, నుదురు రాసుకుని, సైనిక వందనం అందుకున్నారు. ముక్కు రాసుకునే సంప్రదాయాన్ని ‘హోంగీ’గా పిలుస్తారు. దీని వల్ల శ్వాస మార్పిడి జరిగి, రెండు మనసులు కలుస్తాయని స్థానికులు విశ్వాసం. న్యూజిలాండ్ మూలవాసులైన మవోరీలు క్రీ.శ. 1280లో అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి.

 గవర్నర్ జనరల్‌తో ద్వైపాక్షిక చర్చలు..
 స్వాగతం తర్వాత ప్రణబ్.. గవర్నర్ జనరల్ మట్‌పరే భేటీ అయ్యారు. న్యూజిలాండ్-భారత్‌ల మధ్య విమాన సర్వీసుల అనుసంధానంపై చర్చించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావాలని న్యూజిలాండ్ కంపెనీలను కోరారు. ప్రణబ్‌కు మట్‌పరే గౌరవ విందు ఇచ్చారు. భారత విజయ గాథలో తమ దేశం భాగం కావాలనుకుంటోదన్నారు.తమ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో న్యూజిలాంజ్ ప్రాధాన్య దేశమని, దానితో వ్యాపార రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రణబ్ ‘న్యూజిలాండ్ హెరాల్డ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. న్యూజిలాండ్‌లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement