Nari shakti award
-
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్‌ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్‌షాప్‌ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్‌గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్‌పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ► 'విక్షిత్ భారత్', 'భారత్ - లోక్తంత్రకి మాతృక' అనే జంట థీమ్‌ల ఆధారంగా ఈ ఏడాది జరిగిన కవాతులో 13,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. ► మొదటిసారిగా, శంఖం, నాదస్వరం, నగడ వంటి భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళా కళాకారులు కవాతును ప్రారంభించారు. ► కర్తవ్య మార్గంలో మహిళలతో కూడిన ట్రై-సర్వీస్ బృందం తొలిసారిగా కవాతు చేసింది. మహిళా పైలట్లు కూడా 'నారీ శక్తి'ని సూచిస్తూ ఫ్లై పాస్ట్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) దళం కూడా పూర్తిగా మహిళా సిబ్బందిని కలిగి ఉంది. ► భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ప్రదర్శించిన చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 శకటం ఆకట్టుకుంది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో పొందుపర్చారు. మహిళా శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను కూడా చూపించారు. ► అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన బాల రాముని శకటం ఆకర్షించింది. రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. బాల రాముడు విల్లు, బాణాలు ధరించిన రూపాన్ని శకటంలో రూపొందించారు. ► దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైతోంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పడానికి ఎన్నికల సంఘం ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ఆకర్షణగా నిలిచింది. ► కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసుల బృందాలకు మహిళా సిబ్బంది నాయకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాంటింజెంట్కి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లక్రా నాయకత్వం వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ తన్మయీ మొహంతి నాయకత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ లీడర్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
Nasira Akhtar: చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర.. అద్భుత ఆవిష్కరణతో..
‘ఏముందీ... అంతా బూడిద’ అంటుంటారు. చక్కని ఆలోచనలు సొంతం కావాలేగానీ బూడిదలో నుంచి కూడా బంగారంలాంటి అవకాశాలు జనిస్తుంటాయి. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా! అయితే మీరు నసీరా అఖ్తర్ గురించి తెలుసుకోవాల్సిందే... కశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతానికి చెందిన నసీరా అఖ్తర్ ‘మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి మనతో మౌనంగా సంభాషిస్తాయి’ అనే పెద్దల మాటను విన్నదో లేదోగానీ మొక్కలతో గడపడం ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టమే తనకు పర్యావరణంపై ఆసక్తిని పెంచింది. హైస్కూల్ రోజులలో క్లాస్‌రూమ్‌లో తన ప్రశ్నలు లేని రోజు అంటూ ఉండేది కాదు. ఏదో అడగాలి కాబట్టి అడగాలి అనే కోవకు చెందిన ప్రశ్నలు కావు అవి. తనలోని విజ్ఞానదాహానికి ప్రతీకలుగా నిలిచే ప్రశ్నలు. అయితే నసీరా ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. చాలా ఓపికగా సమాధానాలు చెప్పేవారు. ‘నీలో సైంటిస్ట్ లక్షణాలు కనిపిస్తున్నాయి’ అని అంతా చమత్కారంగా అనేవాళ్లు. కట్ చేస్తే... నసీరాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అంతమాత్రాన ఇల్లే లోకం అనుకోలేదు. ఇంటి పనే సర్వస్వం అనుకోలేదు. దినపత్రికలు, మ్యాగజైన్లలో తనకు ఆసక్తి కలిగించే శాస్త్రీయ విషయాలకు సంబంధించిన వ్యాసాలను కత్తిరించి దాచుకునేది. ఊళ్లో మిగిలిన మహిళలకు భిన్నంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనిపించే నసీరాను ఎవరో ఒకరు వెక్కిరిస్తూనే ఉండేవారు. అయితే.. తన ప్రపంచంలో తాను ఉండే నసీరాకు వాటి గాలి సోకేది కాదు. చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర ఒక కల కన్నది. మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థాన్ని తయారుచేయాలి... అనేది ఆ కలల సారాంశం. సంవత్సరం గడిచింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది. రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రయోగాలు ఆపలేదు. ఆ సమయంలోనే మనసులో ఏదో ఒక మూల చిన్న నిరాశ తొంగిచూసింది. అయితే అంతలోనే తాత చెప్పిన మంచిమాట గుర్తుకు వచ్చి తనను ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లేది. ‘ఒక కాలం నీ కోసం ఎదురుచూస్తుంటుంది. అది దగ్గరికి వచ్చిన తరువాత ఎగుడు దిగుళ్లను సరిచేసి నీ ముందు రాచబాటను ఏర్పాటు చేస్తుంది’... తాత తనకు చెప్పిన కశ్మీరి జానపద కథల్లోని ఒక మాట ఇది. ఆ కథలేవీ గుర్తులేవు. కాని ఈ మాట మాత్రం తనకు చాలా గట్టిగా గుర్తుండిపోయింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత... ఎనిమిది సంవత్సరాల తరువాత... తన ప్రయోగం ఫలించింది. పర్యావరణానికి హాని కలిగించకుండా స్థానికంగా పెరిగే మొక్కలను ఉపయోగించి పాలిథిన్ను బూడిదగా మార్చే బయోడిగ్రేడబుల్ హెర్బల్ ఫార్ములాను తయారుచేసి తొలి విజయకేతనం ఎగరేసింది. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది నసీరా. 48 సంవత్సరాల నసీరా అఖ్తర్‌కు మరెన్నో కలలు ఉన్నాయి. ఇప్పుడు వాటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు -
'నారీ శక్తిమతి' రాధికా మెనన్
అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి భవనం వేడుకలకు వేదికైంది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను రాష్ట్రపతి స్వయంగా ‘నారీశక్తి పురస్కారం’తో సత్కరిస్తున్నారు. వారిలో రాధికా మెనన్ కూడా ఉన్నారు. తుపానులో నడి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించిన ధీర ఆమె. కెప్టెన్‌గా తొలి మహిళ రాధికామెనన్ పుట్టింది కేరళలోని కోదుంగళ్లూర్‌లో. కొచ్చిలోని ‘ఆల్ ఇండియా మెరైన్ కాలేజ్’లో కోర్సు పూర్తయిన తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రేడియో ఆఫీసర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2012లో ఇండియన్ మర్చంట్ నేవీలో కెప్టెన్ అయ్యారు. మర్చంట్ నేవీలో ఒక మహిళ కెప్టెన్ కావడం ఆమెతోనే మొదలు. మెనన్ అదే ఏడాది దాదాపుగా 22 వేల టన్నుల అత్యంత కీలకమైన ఆయిల్ ట్యాంకర్ ‘సువర్ణ స్వరాజ్య’ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలుసుకోవాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్లాలి. లంగరు తెగిపోయింది అది 2015, జూన్ నెల. బంగాళాఖాతంలో పెను తుపాను. సముద్రం అల్లకల్లోలంగా సుడులు తిరుగుతోంది. అలలు 15 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ ‘దుర్గమ్మ’ ఆ సుడుల్లో చిక్కుకుపోయింది. లంగరు తెగిపోవడంతో పడవ గమ్యం లేకుండా అలల తాకిడికి అల్లల్లాడుతూ కొట్టుకుపోతోంది. ఆహారపదార్థాలు, తాగునీరు ఉప్పునీటి పాలయ్యాయి. పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు ప్రాణాలను చిక్కబట్టుకుని తీరం చేరే దారి కోసం చూస్తున్నారు. వారి ఇళ్లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లిన వాళ్ల జాడలేకపోవడంతో ఆశలు కూడా వదులుకున్నారు. ఆచూకీ దొరకని జాలర్లు పదిహేనేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు వాళ్లు. అన్ని ఇళ్లలో తల్లులు, భార్యాపిల్లలు తమ తమవాళ్ల కోసం ఆశగా ఎదురు చూసి చూసి ఇక ఆశ చంపుకుని మనసు చిక్కబట్టుకుని అంత్యక్రియలకు సన్నద్ధమవుతున్నారు. ఆ సమయంలో సముద్రంలో రాధికా మెనన్ తన టీమ్‌తో ఈ మత్స్యకారులను రక్షించడంలో మునిగిపోయి ఉన్నారు. పడవలో చిక్కుకున్న వాళ్లకు లైఫ్‌జాకెట్లు అందచేసి, పైలట్ ల్యాడర్ సహాయంతో దుర్గమ్మ పడవలో నుంచి ఒక్కొక్కరిని షిప్ మీదకు చేర్చారామె. అలా అందరూ ప్రాణాలతో తమవాళ్లను చేరుకున్నారు. తుపాను సమయంలో నడిసముద్రంలో అంతటి సాహసోపేతంగా విధులు నిర్వర్తించినందుకు గాను 2016 సంవత్సరానికి గాను ఆమె అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రదానం చేసే ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అవార్డు’ను, ఐఎమ్‌వో బ్రేవరీ అవార్డును అందుకున్నారు. షిప్ కమాండర్‌గా ఇవన్నీ విధుల్లో భాగమేనంటారు రాధిక. తోటి మహిళా నావల్ అధికారులు సునీతి బాల, శర్వాణి మిశ్రాలతో కలిసి ముంబయి కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్ సీ ఫారర్స్ ఫౌండేషన్ స్థాపించి యువతులను ఈ రంగంలోకి ప్రోత్సహిస్తున్నారామె. అలాగే ఢిల్లీ నుంచి వెలువడుతున్న మ్యారిటైమ్ మ్యాగజైన్ ‘సీ అండ్ కోస్ట్’ కు సలహామండలి సభ్యురాలు కూడా. ఇవన్నీ తెలిసే కొద్దీ రాధికామెనన్ నారీశక్తి పురస్కారానికి అచ్చంగా మూర్తీభవించిన రూపం అనిపిస్తుంది. -
15 మందికి నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి, 93 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించి చండీగఢ్ అద్భుతంగా పేరు సంపాదించి, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన శతాధిక వృద్ధ అథ్లెట్, మష్రూమ్ మహిళ, జార్ఖండ్ లేడీ టార్జాన్ సహా 15 మంది 2019 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా మహిళా శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40–బీహార్), అరిఫా జాన్ (33–శ్రీనగర్, జమ్మూ కశ్మీర్), చారి ముర్ము (47–జార్ఖండ్), నిలజా వాంగ్మో (40–లేహ్), రష్మీ ఊర్థర్దేశ్ (60–పుణే, మహారాష్ట్ర), మాన్ కౌర్ (103–పాటియాలా, పంజాబ్), కళావతీ దేవీ (68–కాన్పూర్, ఉత్తరప్రదేశ్), తాషి, నుంగ్షీ (కవలలు) (28– డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్), కౌషికి చక్రవర్తి (38–కోల్‌కతా, పశ్చిమబెంగాల్), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్ (వాయుసేన మొదటి మహిళా పైలెట్లు), భగీరథి అమ్మా (105)– కాత్యాయని(98) (అలప్పుజ–కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. పౌష్టికాహార లోపాల్ని నివారించండి: ప్రధాని నారీశక్తి అవార్డు పొందిన 15 మందిలో 14 మందితో ప్రధాని మోదీ తన నివాసంలో ముచ్చటించారు. పిల్లల్లో, మహిళల్లో ఉన్న పౌష్టికాహార లోపాల్ని నివారించడం, నీటిని బొట్టు బొట్టు సంరక్షించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నారీ మణులు సాధించిన లక్ష్యాలు కేసు స్టడీలుగా యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో కశ్మీర్‌కు చెందిన ఆరిఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. భూదేవి విజయగాథ ముగ్గురు ఆడపిల్లల తల్లినని తాను ఏనాడూ చింతించ లేదని భర్త వదలి వేస్తే కన్న వారింటిలో ఉండి గ్రామీణ, గిరిజన మహిళల వికాసానికి నడుం కట్టానని నారీశక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి అన్నారు. ఆమె అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను వివరించారు. గిరిజనుల్లో సవర తెగకు చెందిన తనకు చిరుప్రాయంలోనే వివాహమైతే ముగ్గురూ ఆడపిల్లలనే కన్నానని మెట్టినింటి వారు బయటకు పంపేశారన్నారు. తండ్రి చాటు బిడ్డగా పొలం పనిని నేర్చుకున్నానని, తనలాంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. 1–70 గిరిజన చట్టంలోని హక్కులు, మహిళా హక్కులను గురించి సభల్లో తెలుసుకున్నానని ఆ చట్టం కింద మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి కొన్ని వేల ఎకరాల పోడు భూమిని సేకరించి చిరుధాన్యాల సాగుకు పూనుకున్నామన్నారు. పంటను మార్కెట్‌కు పంపితే డబ్బులు వస్తాయి కానీ పౌష్టికాహారం అందదు, అందుకే వాల్యూ అడిషన్ను చేకూర్చాలని నిర్ణయించాము. కంపెనీలను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పొడిగా మార్చి మార్కెటింగ్ చేయడం, బిస్కెట్లుగా తయారు చేయడం వంటివి మొదలు పెట్టాము. ఈరోజు తాము 15,000 మంది ఐసీడీఎస్ పథకం కింద ఉన్న బాలబాలికలకు (3–4 ఏళ్లలోపు) బిస్కెట్లు సరఫరా చేసి పౌష్టికాహారం అందజేయగలుగుతున్నాము. కలెక్టర్ సహకారంతో పంటలను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఆమె వివరిస్తుండగా ప్రధాని అభినందించారు. భూదేవి తాను ప్రసంగించేటపుడు తనకు హిందీ రాదని అయినా హిందీలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాననన్నారు. ఆమె చక్కగా హిందీ , కొన్ని ఇంగ్లీషు పదాలతో కలగలిపి చేసిన ప్రసంగం ప్రధానిని హత్తుకుంది. మీరు హిందీ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడలేననే చింత వద్దు అని అన్నారు. -
రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు. క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించి.. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్ కౌర్‌కు నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడలా భూదేవి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 96 ఏళ్ల కాత్యాయని అమ్మ, భగీరతి అమ్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన కవలలు తషీ మాలిక్, మన్ కౌర్‌తోపాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ మోహన జితర్వాల్, అవని చతుర్వేది, భావన కాంత్, బీహార్‌కు చెందిన (మశ్రూమ్ మహిళ) బినా దేవికి నారీ శక్తి పురస్కారాలు అందజేశారు. -
రక్తపు మడుగులో మునిగినా ఏడ్వలేదు.. కానీ
మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఒక విషయం పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. కొంతమంది తీవ్ర ఉద్వేగాలకు లోనవుతారు. అయితే తాము మానసికంగా దృఢంగా లేమన్న విషయాన్ని గుర్తించరు. తమను పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారన్న భయంతో... అందుకు చికిత్స కూడా తీసుకోరు అంటారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. భారతదేశ మహిళా అత్యున్నత నారీశక్తి పురస్కార గ్రహీత ఆమె. తమిళనాడుకు చెందిన మాళవిక పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిసబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరును సోషల్ మీడియాలో ప్రస్తావించారు. నిజంగా శాపగ్రస్తురాలే..! ‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. బాంబు పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందని’ మాళవిక చెప్పుకొచ్చారు. అదే పెద్ద శాపం.. ‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి. విద్యా విధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకే గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రానైడ్ పేలడంతో... మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్- హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. అదే విధంగా సోషల్ వర్క్‌లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఇదే కాదు మరెన్నో పురస్కారాలను మాళవిక అందుకున్నారు. 17 years ago, when I was lying on the hospital bed, I heard a bunch of women whisper, “Did you see that new girl in the general ward? What a shame! She must be cursed as now her life has now come to an end.”#WorldDisabilityDay #InternationalDisabilityDay #IDPD2019 #Disability pic.twitter.com/P9ZhWDslIK — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2019 -
జయమ్మకు నారీ శక్తి పురస్కారం ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ : నారీ శక్తి పురస్కారాన్ని 2017 సంవత్సరానికిగానూ తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలకు గుర్తింపుగా తెలగాణకు చెందిన జయమ్మను నారీ శక్తి పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. అమాయక మహిళలను పడుపు వృత్తిలోకి నెట్టుతున్న శక్తులను అడ్డుకోవాలని, హెచ్ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
అమలకు నారీ శక్తి అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటి అక్కినేని అమలకు నారీ శక్తి పురస్కారం లభించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా అందించే ఈ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 33 మంది మహిళలకు రాష్ట్రపతి నారీశక్తి పురస్కారాలను అందజేశారు. వ్యక్తిగత సమాజ సేవకు గుర్తింపుగా అమలకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవార్డుతో సమాజ సేవలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. సమాజ సేవకు తాను చేస్తున్న కృషికి తన కుటుంబం నుంచి అందుతున్న సాయం ఎంతో ఉందన్నారు. వివిధ రంగాల్లో మరింత సాయం చేయడానికి తన వద్ద ప్రణాళిక ఉందని, దీన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు అందించి తన భవిష్యతు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె తెలిపారు.