మైత్రి రావు
మహిళలు చదువుకుంటున్నారు.
మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.
మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు.
మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు.
‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు.
‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్‌లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను.
డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది.
నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు.
మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్‌లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను.
నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్‌పూర్, కొండాపూర్, బంజారా హిల్స్‌లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు.
సాధించాం... ఇంకా ఉంది
నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది.
ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది.
మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment