రికార్డులు బద్దలు | The record-breaking | Sakshi
Sakshi News home page

రికార్డులు బద్దలు

Published Wed, Feb 11 2015 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

The record-breaking

ఎక్కువైనా.. తక్కువైనా ఆప్‌దే రికార్డు..
 
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సునామీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీల రికార్డులు బద్దలైపోయాయి. పశ్చిమ ఢిల్లీ లోని వికాస్‌పురి స్థానంలో ఆప్ అభ్యర్థి మహీందర్ యాదవ్ బీజేపీ అభ్యర్థి సంజయ్‌సింగ్‌పై ఏకంగా 77, 665ఓట్ల మెజారిటీతో గెలిచారు. బురారీ స్థానంలో ఆప్ అభ్యర్థి సంజీవ్ ఝా బీజేపీకి చెందిన గోపాల్ ఝాపై 67,950 ఓట్ల మెజార్టీతో రెండో అతి పెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఓఖ్లాలో అమానతుల్లాఖాన్ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బ్రహమ్‌సింగ్‌పై 64, 532 ఓట్ల తేడాతో గెలిచారు. సుల్తాన్‌పూర్ మజ్రాలో ఆప్ అభ్యర్థి సందీప్‌కుమార్‌కు బీజేపీ అభ్యర్థి ప్రభు దయాళ్‌పై 64,439 ఓట్ల మెజారిటీ వచ్చింది. డియోలీలో ఆప్ విజేత ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్‌పై 63, 937 ఓట్ల మెజారిటీని సాధించారు.

బావనాలో ఆప్ అభ్యర్థి వేద్ ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి గుజన్‌సింగ్‌ను 50, 023 ఓట్ల తేడాతో ఓడించారు. ద్వారక నుంచి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్శ్ శర్మ కమలనాథుల అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్‌పుత్‌పై 39,366 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ ప్రత్యర్థి నుపుర్‌శర్మను 31,583 ఓట్ల తేడాతో ఓడించారు. 20 వేలు.. అంతకంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆప్ అభ్యర్థులు మొత్తం 45 మంది ఉండటం విశేషం. కేవలం 22మంది మాత్రమే 20వేలకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. అతితక్కువ మెజారిటీ సాధించిన రికార్డును కూడా ఆపేసొంతం చేసుకుంది. నజఫ్‌గఢ్ ఆ పార్టీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్ ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిపై కేవలం 1,555 ఓట్ల తేడాతో గెలిచారు. కృష్ణానగర్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీపై ఎస్‌కే బగ్గా సాధించిన మెజారికీ 2277 ఓట్లు మాత్రమే. షకుర్‌బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్‌కు లభించిన ఆధిక్యం 3133 ఓట్లు.
 
అంచనాలను మించిన విజయం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేలిచెప్పాయి కానీ... ఈ స్థాయి గెలుపును ఎవరూ ఊహించలేదు. సాధారణ మెజారిటీని దాటుతుందని సగటున ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఆప్ సునామీనే సృష్టించింది. ఇండియా న్యూస్- యాక్సిస్ పోల్ అందరికంటే ఎక్కువగా ఆప్‌కు 53 సీట్లు వస్తాయని చెప్పింది. న్యూస్ 24 టుడే- చాణక్య పోల్ 48 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ మంగళవారం ఆప్ గ్రాఫ్ అమాంతం ఎగబాకి 67ను తాకింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement