
మంగోలియాతో అనుబంధం
మంగోలియాలో మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి కోసం ఆ దేశానికి భారత్ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 6,344 కోట్లు) రుణం ప్రకటించింది.
6,344 కోట్ల రుణం: మోదీ
మంగోలియా ప్రధానితో చర్చలు.. పలు ఒప్పందాలు
ఇక వ్యూహాత్మకంగా
ద్వైపాక్షిక సంబంధాలు
రక్షణ సహకారం బలోపేతం.. పౌర అణు రంగ సహకారం
ఉలాన్ బటోర్: మంగోలియాలో మౌలిక వసతుల సదుపాయాల అభివృద్ధి కోసం ఆ దేశానికి భారత్ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 6,344 కోట్లు) రుణం ప్రకటించింది. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం రూపంలోకి మార్చుకున్నాయి. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, పౌర అణు రంగంలో సంబంధాలకు గల అవకాశాలను పరిశీలించాలని అంగీకారానికి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజల పర్యటన సందర్భంగా ఆదివారం ఉలాన్ బటోర్‌లో ఆ దేశ ప్రధానమంత్రి చిమెద్ సాయిఖాన్‌బిలేగ్‌తో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు.
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ 13 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సరిహద్దు భద్రత, పోలీసు విధుల నిర్వహణ - నిఘా, వైమానిక సేవలు, సైబర్ భద్రత, నూతన, పునర్వినియోగ విద్యుత్‌శక్తి తదితర అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అనంతరం ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశపు తూర్పు చర్యల విధానం (యాక్ట్ ఈస్ట్ పాలసీ)లో మంగోలియా కూడా అంతర్భాగమని మోదీ పేర్కొన్నారు. ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని తనే కావటం తనకు లభించిన గౌప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఉగ్రవాదంతో వ్యవహరించే విషయంలో అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఇరువురు నేతలూ సంయుక్త ప్రకటనలో తప్పుపట్టారు. ఉగ్రవాదుల సురక్షిత కేంద్రాలన్నిటినీ జాప్యం లేకుండా తుడిచిపెట్టటం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
పరస్పరం కానుకలు...
మోదీ తొలుత గాందాన్ టెగ్చిలెన్ భౌద్ధారామాన్ని సందర్శించి మంగోలియాలో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రజల స్నేహ చిహ్నంగా బోధి వృక్షం మొక్కను ఆ రామానికి బహూకరించారు. కేన్సర్ వ్యాధి చికిత్స కోసం భారత్‌లోని భాభా అణు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన యంత్రం ‘భాభాట్రాన్’ను మోదీ మంగోలియా దేశానికి కానుకగా ఇచ్చారు. రాజధానిలోని జాతీయ కేన్సర్ కేంద్రాన్ని సందర్శించిన మోదీ.. ఈ చికిత్స యంత్రాన్ని అందజేశారు. మంగోలియా సంప్రదాయ ఉత్సవం నాదామ్ (స్థానికంగా పురుషుల మూడు క్రీడల ఉత్సవంగా పేర్కొంటారు) లో మోదీ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు, టోపీ ధరించిన ప్రధాని.. గుర్రపు పందాలు, సంప్రదాయ కుస్తీ పోటీలు, విల్లంబుల పోటీలను వీక్షించారు. ఈ సందర్భంగా మోదీకి మంగోలియా ప్రధాని.. ‘కంఠక’ అనే రేసు గుర్రాన్ని బహూకరించారు.
.
అధ్యక్షుడితో మోదీ సెల్ఫీ...
మంగోలియా అధ్యక్షుడు త్సాఖియాజియిన్ ఎల్బెగ్దోర్జ్‌తోనూ మోదీ సమావేశమై చర్చించారు. ఆయనతో మోదీ ‘సెల్ఫీ’ (స్వీయ ఫొటో) తీసుకున్నారు. ఇద్దరు అగ్ర నేతలూ ట్విటర్‌లో ఈ సెల్ఫీలను పోస్ట్ చేశారు. అనంతరం ఆ దేశ పార్లమెంటు స్టేట్ గ్రేట్ హురల్ ప్రత్యేక సమావేశంలో ఆ దేశ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మంగోలియా దేశ ముద్రలో ఇతర గుర్తులతో పాటు ఉన్న ‘కమలం’ పుష్పాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. తమ పార్టీ బీజేపీ గుర్తు కూడా కమలమే అని అన్నారు.