జల్లికట్టుపై నిషేధం తొలగింపు
పలు షరతులతో అనుమతించిన కేంద్రం
♦ హర్షం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం
♦ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న పెటా
న్యూఢిల్లీ: వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఎడ్లను రెచ్చగొడుతూ, వాటిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే ఈ క్రీడకు పలు ఆంక్షలతో అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై తమిళనాడులో హర్షం వ్యక్తమవుతుండగా... జంతు ప్రేమికులు, హక్కుల సంస్థలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఏటా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సాంప్రదాయక క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధాన్ని తాజాగా ఎన్డీయే ప్రభుత్వం తొలగించడం గమనార్హం. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది.
జల్లికట్టు, ఎడ్ల పందేలకు అనుమతినిచ్చినా... వాటిని ప్రదర్శన కోసంగానీ, వివిధ పనులు చేసేలా శిక్షణ ఇవ్వడంగానీ చేయరాదని స్పష్టం చేసింది. జల్లికట్టు నిర్వహించే ప్రదేశం కనీసం 15 మీటర్ల దూరంలో చుట్టూ కంచె ఉండేంత విశాలంగా ఉండాలంది. పాల్గొనే ఎద్దు పూర్తి ఆరోగ్యంతో ఉందని పశు వైద్యాధికారితో ధ్రువీకరణ పొందాలని, వాటికి సామర్థ్యాన్ని పెంచే ఎటువంటి డ్రగ్స్ వాడొద్దని తెలిపింది. ఇక ఎడ్ల బండ్ల పందాలకు ప్రత్యేకమైన మార్గం (ట్రాక్) వినియోగించాలని, అది రెండు కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం ఉండకూదని పేర్కొంది.
జయలలిత హర్షం.. మరికొద్ది రోజుల్లో పొంగల్ పండుగ ప్రారంభంకానుండగా.. జల్లికట్టుపై నిషేధం తొలగించడాన్ని ఆ రాష్ట్ర సీఎం జయలలిత స్వాగతించారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. డీఎంకే అధినేత కరుణానిధి, ఇతర పార్టీల నేతలు, రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమర్థించుకున్నారు. సాంస్కృతిక, చారిత్రక క్రీడ అయినందునే జల్లికట్టును అనుమతించి ఎన్నో షరతులు విధించామన్నారు.
సుప్రీంకు వెళతాం: పెటా
కేంద్రం నిర్ణయాన్ని జంతువుల హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఓ వైపు ఆవులు వంటి వాటిని సంరక్షించాలంటూనే మరోవైపు జల్లికట్టు వంటి క్రీడను అనుమతివ్వడం ఏమిటని పెటా సంస్థ మండిపడింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పెటా ఇండియా సీఈవో పూర్వా జోషిపుర చెప్పారు. జల్లికట్టులో ఎడ్లను రెచ్చగొట్టేందుకు మద్యం తాగించడం, వాటి తోకలను మెలిపెట్టడం, కొరకడం, కత్తులు, పదునైన వస్తువులతో గుచ్చడం వంటివి చేస్తూ హింసిస్తారని.. దీనికి అనుమతివ్వడం దారుణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధం
జల్లికట్టుపై నిషేధం ఎత్తేయటాన్ని కేంద్ర మంత్రి మేనక గాంధీ నేతృత్వంలో నడిచే పీపుల్ ఫర్ ఎనిమల్ (పీఎఫ్‌ఏ) సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు, భారతీయ సంస్కృతికి విరుద్ధమని విమర్శించింది. కాగా, జలికట్టుకు అనుమతినివ్వటంపై కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మంత్రి మేనక గాంధీ లేఖ రాశారు.