‘చవితి’ భద్రతపై సమీక్ష
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. హిందూ సంఘాల నేతృత్వంలో ప్రతి ఏటా వాడవాడల్లో రోడ్ల మీద బొజ్జగణపయ్య విగ్రహాలను కొలువు దీర్చి పూజలు చేస్తారు. ఈ ఏడాది వినాయక చవితి పర్వదినానికి తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. 29వ తేదీన పండుగ కావడంతో విగ్రహాల కొలువు మీద హిందూ సంఘాలు దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారుు.
అదే సమయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన భద్రతపై ఆయా జిల్లా యంత్రాంగాలు సమీక్షిస్తున్నారుు. డీజీపీ రామానుజం ఆదేశాలతో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఇవ్వాలి, చేపట్టాల్సిన భద్రతపై జిల్లా పోలీసు అధికారులు కసరత్తుల్లో ఉన్నారు.
ఏడాది కాలంగా హిందూ సంఘాల నాయకులపై దాడులు పేట్రేగుతుండడంతో, ఎక్కడ వినాయక చవితి పర్వదినాన్ని అస్త్రంగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతాయోనన్న ఆందోళన మొదలైంది. ఈ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భద్రతతో పాటుగా గణపయ్యల విగ్రహాల కొలువుకు ప్రత్యేక ఆంక్షల చిట్టాను సిద్ధం చేస్తున్నారు.
సమీక్ష : రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ప్రతి ఏటా వెయ్యి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. గత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరిగింది. 1800 చోట్ల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది అంతకన్నా, ఎక్కువ చోట్ల విగ్రహాల ఏర్పాటుకు హిందూ సంఘాలు కసరత్తు చేస్తున్నారుు.
దీంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఎక్కడెక్కడ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, భద్రతపై సమీక్షకు చెన్నై పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉదయం ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని వివరాల్ని ఆయా ప్రాంత ఇన్‌స్పెక్టర్ల నుంచి సేకరించారు. అనంతరం ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై అదనపు కమిషనర్లు కరుణా సాగర్, అమాష్‌కుమార్‌ల నేతృత్వంలో జరిగిన సమీక్షకు జాయింట్, డెప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు. భద్రతా అంశాలపై సమీక్షించారు.
కొత్త నిబంధనలపై సమీక్షించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి నిర్ణయించారు. గురువారం చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ నేతృత్వంలో జరిగే సమావేశం అనంతరం ఎక్కడెక్కడ విగ్రహాలకు అనుమతి, ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు, విగ్రహ నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు రూట్లు, భద్రతకు సంబంధించిన వివరాలు, ఆంక్షల చిట్టాను ప్రకటించనున్నారు.