dgp ramanujam
-
డీజీపీ ఎవరు?
* ముగియనున్న రామానుజం పదవీ కాలం * రేసులో నలుగురు * కేంద్రానికి జాబితా సాక్షి, చెన్నై: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రామానుజం పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి డీజీపీ ఎవరన్న ప్రశ్న పోలీసు వర్గాల్లో మొదలైంది. ఈ పదవికి అర్హులుగా పేర్కొంటూ నలుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా రామానుజంను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రను పోషించారు. అధికార పక్షానికి విధేయతను చాటిన ఆయన 2012 నవంబరులో పదవీ విరమణ పొందారు. దీంతో తదుపరి డీజీపీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ అప్పట్లో మొదలైంది. అయితే, ఈ చర్చకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేసులో ఉన్న ఇతర అధికారుల్ని నిరాశలో పడేసింది. రామానుజం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఆయన సేవల్ని మరింతగా వినియోగించుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్లు: రామానుజం పదవీ కాలాన్ని పొడిగించడంపై కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, అవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ముందుకు చతికిల బడ్డారుు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా తన పదవిని రామానుజం కొనసాగిస్తున్నారన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. ఇది వరకు ఆయన పదవీ కాలం పొడిగించినప్పుడే కేంద్రం సైతం వ్యతిరేకించింది. ఈ దృష్ట్యా, ఇక, ఆ పదవిలో రామానుజం మళ్లీ కొనసాగే పరిస్థితులు లేవు. దీంతో తదుపరి డీజీపీ ఎవరు అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది. నలుగురితో జాబితా: రామానుజంకు ఇక విశ్రాంతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే సిఫారసు మేరకు ఒకరిని ఎంపిక చేస్తూ కేంద్రం ఆమోదం తెలపడం సహజం. దీంతో కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి నలుగురి పేర్లను సూచిస్తూ కేంద్రానికి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో ప్రస్తుతం డీజీపీ హోదాతో ఇతర విభాగాల్లో ఉన్న అనూప్ జైశ్వాల్, కె ముత్తుకరుప్పన్, ఆర్ శేఖర్, అశోక్ కుమార్లు ఉన్నారు. అనూప్ జైశ్వాల్ లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా శాంతి భద్రతల పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో అధికార పక్షంతోపాటుగా అన్ని పార్టీలకు చుక్కలు చూపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ దృష్ట్యా, ఆయన చేతికి శాంతి భద్రతల పగ్గాలు వెళ్లొచ్చన సంకేతాలు ఉన్నా, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
‘చవితి’ భద్రతపై సమీక్ష
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. హిందూ సంఘాల నేతృత్వంలో ప్రతి ఏటా వాడవాడల్లో రోడ్ల మీద బొజ్జగణపయ్య విగ్రహాలను కొలువు దీర్చి పూజలు చేస్తారు. ఈ ఏడాది వినాయక చవితి పర్వదినానికి తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. 29వ తేదీన పండుగ కావడంతో విగ్రహాల కొలువు మీద హిందూ సంఘాలు దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారుు. అదే సమయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన భద్రతపై ఆయా జిల్లా యంత్రాంగాలు సమీక్షిస్తున్నారుు. డీజీపీ రామానుజం ఆదేశాలతో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఇవ్వాలి, చేపట్టాల్సిన భద్రతపై జిల్లా పోలీసు అధికారులు కసరత్తుల్లో ఉన్నారు. ఏడాది కాలంగా హిందూ సంఘాల నాయకులపై దాడులు పేట్రేగుతుండడంతో, ఎక్కడ వినాయక చవితి పర్వదినాన్ని అస్త్రంగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతాయోనన్న ఆందోళన మొదలైంది. ఈ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భద్రతతో పాటుగా గణపయ్యల విగ్రహాల కొలువుకు ప్రత్యేక ఆంక్షల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. సమీక్ష : రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ప్రతి ఏటా వెయ్యి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. గత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరిగింది. 1800 చోట్ల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది అంతకన్నా, ఎక్కువ చోట్ల విగ్రహాల ఏర్పాటుకు హిందూ సంఘాలు కసరత్తు చేస్తున్నారుు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఎక్కడెక్కడ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, భద్రతపై సమీక్షకు చెన్నై పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉదయం ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని వివరాల్ని ఆయా ప్రాంత ఇన్స్పెక్టర్ల నుంచి సేకరించారు. అనంతరం ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై అదనపు కమిషనర్లు కరుణా సాగర్, అమాష్కుమార్ల నేతృత్వంలో జరిగిన సమీక్షకు జాయింట్, డెప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు. భద్రతా అంశాలపై సమీక్షించారు. కొత్త నిబంధనలపై సమీక్షించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి నిర్ణయించారు. గురువారం చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ నేతృత్వంలో జరిగే సమావేశం అనంతరం ఎక్కడెక్కడ విగ్రహాలకు అనుమతి, ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు, విగ్రహ నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు రూట్లు, భద్రతకు సంబంధించిన వివరాలు, ఆంక్షల చిట్టాను ప్రకటించనున్నారు.