డీజీపీ ఎవరు?
* ముగియనున్న రామానుజం పదవీ కాలం
* రేసులో నలుగురు
* కేంద్రానికి జాబితా
సాక్షి, చెన్నై: రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ రామానుజం పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి డీజీపీ ఎవరన్న ప్రశ్న పోలీసు వర్గాల్లో మొదలైంది. ఈ పదవికి అర్హులుగా పేర్కొంటూ నలుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా రామానుజంను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రను పోషించారు. అధికార పక్షానికి విధేయతను చాటిన ఆయన 2012 నవంబరులో పదవీ విరమణ పొందారు. దీంతో తదుపరి డీజీపీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ అప్పట్లో మొదలైంది. అయితే, ఈ చర్చకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేసులో ఉన్న ఇతర అధికారుల్ని నిరాశలో పడేసింది. రామానుజం పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఆయన సేవల్ని మరింతగా వినియోగించుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు.
పిటిషన్లు: రామానుజం పదవీ కాలాన్ని పొడిగించడంపై కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, అవన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ముందుకు చతికిల బడ్డారుు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా తన పదవిని రామానుజం కొనసాగిస్తున్నారన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం నవంబరు నాలుగో తేదీతో ముగియనుంది. ఇది వరకు ఆయన పదవీ కాలం పొడిగించినప్పుడే కేంద్రం సైతం వ్యతిరేకించింది. ఈ దృష్ట్యా, ఇక, ఆ పదవిలో రామానుజం మళ్లీ కొనసాగే పరిస్థితులు లేవు. దీంతో తదుపరి డీజీపీ ఎవరు అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది.
నలుగురితో జాబితా: రామానుజంకు ఇక విశ్రాంతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించే సిఫారసు మేరకు ఒకరిని ఎంపిక చేస్తూ కేంద్రం ఆమోదం తెలపడం సహజం. దీంతో కొత్త డీజీపీ ఎంపికకు సంబంధించి నలుగురి పేర్లను సూచిస్తూ కేంద్రానికి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో ప్రస్తుతం డీజీపీ హోదాతో ఇతర విభాగాల్లో ఉన్న అనూప్ జైశ్వాల్, కె ముత్తుకరుప్పన్, ఆర్ శేఖర్, అశోక్ కుమార్‌లు ఉన్నారు. అనూప్ జైశ్వాల్ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా శాంతి భద్రతల పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో అధికార పక్షంతోపాటుగా అన్ని పార్టీలకు చుక్కలు చూపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ దృష్ట్యా, ఆయన చేతికి శాంతి భద్రతల పగ్గాలు వెళ్లొచ్చన సంకేతాలు ఉన్నా, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.