
‘టైమ్స్ ఆసియా’లో ఐఐఎస్సీ ర్యాంకు 27
2017 ఏడాదికి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వారు ఆసియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో బెంగళూరులోని ఐఐఎస్సీ
♦ జాబితాలో ఉస్మానియా, ఎస్వీయూ,
♦ ఆచార్య నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు
న్యూఢిల్లీ: 2017 ఏడాదికి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వారు ఆసియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో బెంగళూరులోని ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) 27వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐఎస్సీ ఇదే ర్యాంకును సొంతం చేసుకుంది. ఆసియాలో మొదటి ఐదు విశ్వవిద్యాలయాలుగా వరసగా సింగపూర్ జాతీయ వర్సిటీ, చైనాలోని పెకింగ్, సింగువా విశ్వవిద్యాలయాలు, సింగపూర్‌లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, హాంకాంగ్‌లోని వర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లు నిలిచాయి.
ఐఐఎస్సీతోపాటు ఐఐటీ–బాంబే (42వ ర్యాంకు), తమిళనాడులోని వేల్–టెక్ యూనివర్సిటీ (43), ఐఐటీ–ఢిల్లీ (54), ఐఐటీ–మద్రాసు (62)లు కూడా మెరుగైన స్థానాలు సాధించాయి. ఆసియాలోని టాప్–300 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి మొత్తం 33 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. దీంతో టాప్–300లో అత్యధిక యూనివర్సిటీలను కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది టాప్–200 యూనివర్సిటీల్లో భారత్ నుంచి 16 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి.
టీహెచ్‌ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం టాప్–300 జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 191–200 మధ్య ర్యాంకు, గుంటూరులోని ఆచార్య నాగార్జున, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు 201–250 మధ్య ర్యాంకులు, విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 251 కన్నా ఎక్కువ ర్యాంకు లభించాయి. అయితే ఏ విశ్వవిద్యాలయానికి ఏ ర్యాంకు అన్న కచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ప్రపచంలో భారత యూనివర్సిటీలు వెనుకబడి ఉన్నాయని టీహెచ్‌ఈకి రాసిన వ్యాసంలో ఒకరు పేర్కొన్నారు. టాప్–300 జాబితాలో అత్యధికంగా జపాన్‌కు చెందిన 69 విద్యాసంస్థలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో చైనా 54, భారత్ 33 ఉన్నాయి.