- గతంతో పోలిస్తే తగ్గిన ప్రణాళిక వ్యయం..
- మొత్తం వసూళ్లలోనూ దిగువ ముఖమే
- సేవలు, స్పెక్యులేషన్లపైనే ఆధారపడ్డ ప్రభుత్వం ..
- లోటు తగ్గటంలోనూ అంతర్జాతీయ పరిణామాలే కీలకం
- రాష్ట్రాలకు కేటాయింపులు సైతం గతం కన్నా దిగదుడుపే
- వాస్తవాలను మరుగున పరిచిన జైట్లీ బడ్జెట్
ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదు... పోలవరానికి పూర్తి నిధులూ లేవు.
సాక్షి, బిజినెస్ విభాగం: మొత్తమ్మీద మన రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. అలాగని ఇతర రాష్ట్రాలకూ ఇచ్చిందేమీ లేదు. పన్నుల వాటా పెంచుతున్నామనే కోటలు దాటిన మాటలు తప్ప నిజంగా నిధులు పెంచిందీ లేదు. పోనీ సామాన్యుడికేమన్నా మేలు జరిగిందా అంటే... హోటలు బిల్లు నుంచి ఫోను బిల్లు దాకా అన్నీ పెరిగేలా సేవల పన్ను పెంచారు తప్ప రాయితీల ఊసే లేదు. పోనీ... ఇన్ని చేసినందుకు దేశాభివృద్ధి ఖాయమేనా? ఏమో డౌటే!!
వృద్ధికి కేటాయింపులెక్కడ?
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికాభివృద్ధి 8-8.5 శాతం మధ్య ఉంటుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ఊదరగొట్టేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలతో మరో నెలలో ముగియనున్న 2014-15లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందన్న అంచనాల్ని కూడా ప్రకటించారు. నిజానికి ఇదంతా జీడీపీ గణాంకాల పరిగణనకు తీసుకునే ఆధార సంవత్సరాన్ని (బేస్ ఇయర్) 2004-05 నుంచి 2011-12కు మార్చిన మహిమ. కొత్త బేస్ ఇయర్ ప్రకారం 2013-14లో 6.9 శాతం వున్న వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకాఎకిన 8 శాతాన్ని మించిపోతుందన్నారు జైట్లీ. మరి దానికి కావాల్సిన కేటాయింపులేమైనా ఈ బడ్జెట్లో ఉన్నాయా అంటే లేవు. మరెలా!?
వాస్తవానికి ఏ దేశ వృద్ధికైనా పనికొచ్చేది ప్రణాళికా వ్యయమే. అంటే ఆస్తుల్ని సృష్టించే వ్యయమన్న మాట. ప్రణాళికేతర వ్యయమంటే జీతాల వంటి అంశాలపై పెట్టే ఖర్చే తప్ప ఆస్తులేమీ ఉండవు. అలాంటిది 2014-15 బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద కేటాయించిన మొత్తం ఏకంగా రూ.5.75 లక్షల కోట్లు. మరి 2015-16 బడ్జెట్లో ఈ కేటాయింపులెలా ఉండాలి? వృద్ధి రేటును 8 శాతానికి చే ర్చాలనుకున్నపుడు ఈ కేటాయింపులెంత పెంచాలి? కానీ వాస్తవంగా కేటాయించింది మాత్రం రూ.4.65 లక్షల కోట్లు. మరోవంక 2014-15లో సవరించిన అంచనాల ప్రకారం ప్రణాళిక వ్యయం రూ.4.67 లక్షల కోట్లకు పరిమితమైంది. మరి తాజా అంచనాలను కూడా సవరించాల్సి వస్తే ఏమవుతుంది...?
వసూళ్లు కూడా తక్కువే...
కేటాయింపుల సంగతి సరే! గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ వసూళ్లు కూడా పెరిగే అవకాశం లేదని జైట్లీ అంచనాలే చెబుతున్నాయి. 2014-15లో రెవెన్యూ, క్యాపిటల్ వసూళ్ల ద్వారా రూ.17.94 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఈ సారి ఎంత ఆదాయం వస్తుందని అంచనా వేశారో తెలుసా? కేవలం రూ.17.77 లక్షల కోట్లు. అంటే గతేడాదికన్నా దాదాపు 17 వేల కోట్లు తక్కువ వస్తాయని అంచనా వేశారన్న మాట. ఎక్కడైనా ఏటికేడాది ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మన ప్రభుత్వ ఆదాయమేమో తగ్గుతోంది. ఒకవైపు ఆదాయమూ లేక మరోవైపు ప్రణాళికా బద్ధమైన ఖర్చూపెట్టక వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లోంచా జైట్లీజీ!!!
వ్యవసాయం, పరిశ్రమల వృద్ధి శూన్యం
జీడీపీ పెరుగుతుందని జైట్లీ చెప్పిన అంచనాలు కూడా భారతదేశ జీవనాధారమైన వ్యవసాయాన్నో, భారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలనో ఆధారం చేసుకున్నవి కావు. బలుపు కాదు వాపు అన్న చందాన సేవల రంగాన్ని (సర్వీసు)... రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాల ద్వారానే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆయన అంచనా వేసినట్లు బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి.
నిజంగా రాష్ట్రాలకు నిధులు పెరిగాయా?
నిజమైన ఫెడరల్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, అందుకే ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టామని, రాష్ట్రాలకు పన్నుల వాటాను ఏకంగా 32 నుంచి 42 శాతానికి పెంచామని జైట్లీ చెప్పుకొచ్చారు. ఇతరత్రా బదలాయింపులన్నీ కలిసి రాష్ట్రాలకు మొత్తమ్మీద 62 శాతం నిధులు వెళుతున్నాయని, ఇది చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. తాము ఈ రకంగా రాష్ట్రాలను ఎంత శక్తిమంతం చేస్తున్నదీ కూడా వివరించారు. వినటానికి ఇదంతా బాగానే ఉంది. కానీ అంకెలు చూస్తే అసలు సంగతి బోధపడుతోంది. 14వ ఆర్థిక సంఘం వెలువరించిన నివేదికను చూస్తే గడిచిన ఎనిమిదేళ్లలో (మోదీ ప్రభుత్వం రాకముందు) రాష్ట్రాలకు బదలాయించిన కేంద్ర నిధుల వాటా సరాసరిన 65 శాతం ఉంది. (దిగువ పట్టికలో చూడొచ్చు).
కొన్ని సంవత్సరాల్లో ఏకంగా 70 శాతం కూడా దాటింది. కానీ జైట్లీ ప్రతిపాదించిన లెక్కలు చూస్తే ఏ సంవత్సరం కూడా అప్పటి సగటును మించటమే లేదు. మరి రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చినట్లా? అటు రాష్ట్రాలకూ ఇవ్వక, ఇటు సామాన్యులకూ రాయితీలివ్వక ఈ బడ్జెట్ నిజంగా మేలు చేస్తున్నదెవరికి? ప్రకటించిన వృద్ధి నిజంగా సాధ్యమేనా? ఏమో... కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!!.
లోటు తగ్గిందా... ఎవరి గొప్ప?
2014 మార్చి 31 నాటికి కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.7 శాతం. ఇదిప్పుడు 1.3 శాతానికి దిగి వచ్చిందని, అదంతా తమ ఘనతేనని చెబుతున్నారు జైట్లీ. నిజానికి మోదీ ప్రభుత్వ కృషి వల్లే కరెంటు ఖాతా లోటు తగ్గిందని చెప్పటం కంటే... మన చేతుల్లోలేని అంతర్జాతీయ పరిణామాల వల్ల అదృష్టం కలిసొచ్చి అలా జరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టే సమయానికి అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 106 డాలర్ల దగ్గరుంది.
అలాగే బొగ్గు ధర కూడా టన్ను 102-104 డాలర్ల దగ్గరుంది. మనం దిగుమతి చేసుకునే ఈ రెండూ ఇప్పుడు 60 శాతానికి పైగా పడిపోయాయి. క్రూడ్ ధర 49 డాలర్లకు రాగా... బొగ్గు 55-58 డాలర్ల దగ్గరుంది. వీటి దిగుమతికి మనం వెచ్చించాల్సిన లక్షల కోట్ల రూపాయలు మిగిలి ప్రభుత్వం కరెంటు ఖాతా లోటు పూడ్చుకోవటానికి సహకరించాయి. నిజానికి ఆర్‌బీఐ లెక్కల ప్రకారం 2013-14 ఆఖరి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు జీడీపీలో కేవలం 0.2 శాతం. మరిప్పుడు 1.3 శాతానికి తేవటం వెనక మోదీ ప్రభుత్వ కృషి ఏమిటన్నది సామన్యులకు అర్థంకాని రహస్యం!!