సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను (దేశంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థ) కుదించి జెడ్ కేటగిరి భద్రతను కల్పించడం పట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన తండ్రికేమైనా హానీ జరిగితే మోదీ తోలు వలుస్తానని కూడా హెచ్చరించారు. తండ్రి ప్రాణాలకు ముప్పుందని తెలిసి, ఆయనకు కల్పించిన భద్రతను తొలగిస్తే ఎవరి కొడుకుకైనా రక్తం ఉడికిపోతుందంటూ కొడుకును లాలూ ప్రసాద్ యాదవ్ వెనకేసుకొచ్చారు. కాకపోతే ప్రధానంతటివారిని అంతటి మాట అనకుండా ఉండాల్సిందన్నారు.
ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్’కు చెందిన సైనికులు, పోలీసులు ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అన్న పేరులోనే వారి విధులేమిటో మనకు స్పష్టం అవుతున్నాయి. భయంకరమైన టెర్రరిస్టుల నుంచిగానీ, విదేశీయుల నుంచిగానీ మన జాతికి, అంటే దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకు ఈ ఎన్‌ఎస్‌జీ ఏర్పాటయింది. 1984లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీలోని సైనికులకు కఠోరమైన శిక్షణ పొందిన వారు ఉంటారు. ఎల్తైన భవనాలను ఎక్కేందుకు, హెలికాప్టర్ల నుంచి తాళ్ల సహాయంతో దూకేందుకు, పారా జంపింగ్ తదితర ప్రత్యేక విద్యల్లో వీరికి కఠోరమైన శిక్షణ ఇస్తారు.
ఈ ఎన్‌ఎస్‌జీ సైనికులను వాళ్లు వేసుకునే యూనిఫామ్‌ను బట్టి ‘బ్లాక్ క్యాట్స్’ అని కూడా పిలుస్తారు. వీరిలో స్పెషల్ యాక్షన్ గ్రూప్, స్పెషల్ రేంజర్ గ్రూప్ అని రెండు విభాగాలు ఉంటాయి. పది రోజుల క్రితమే ఎన్‌ఎస్‌జీకి చెందిన హవీల్దార్ గజేంద్ర సింగ్ బిస్త్‌కు ప్రతిష్టాకరమైన ‘అశోక చక్ర’ బిరుదును మరణానంతరం ప్రభుత్వం ఇచ్చింది. ముంబై నగరంపై టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు నారిమన్ హౌజ్ వద్ద పలువురు టెర్రరిస్టులను ప్రాణాలకు తెగించి గజేంద్ర సింగ్ నిలువరించారు. చివరకు టెర్రరిస్టుల గ్రెనేడ్ పేలుడులో మరణించారు. ఆ రోజున టెర్రరిస్టులను ఎదుర్కొనేందుకు ఎన్‌ఎస్‌జీ సైనికులు ప్రదర్శించిన నైపుణ్యం వారికి వచ్చిన నైపుణ్యంలో పది, పదిహేను శాతానికి మించి ఉండదని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మాజీ డీజీ టి. మడియాల్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
ఇంతటి ప్రత్యేక శిక్షణ కలిగిన నైపుణ్యం సాధించిన ఎన్‌ఎస్‌జీ సైనికులను రాజకీయ నాయకుల భద్రతకు ఎందుకు కేటాయిస్తున్నారు? కేవలం ప్రతిష్టకోసమేనన్నది అందరికి తెల్సిందే. అందుకనే రాజకీయ నాయకుల భద్రత నుంచి తమవారి సంఖ్యను తగ్గించాల్సిందిగా ఎన్‌ఎస్‌జీ స్వయంగా కేంద్రానికి పిటిషన్ పెట్టుకొంది. ఆ పిటిషన్‌లో భాగంగానే లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పుడు వారి సెక్యూరిటీని తగ్గించారు. ఇది తప్పా? లాలూ ప్రసాద్ యాదవ్‌కు తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి అంతటి ముప్పు పొంచి ఉందా? ఎంతైన భవనాలు ఎక్కి, హెలికాప్టర్ల నుంచి దూకి, కొండల పైనుంచి పారా జంపింగ్‌లు చేసి ఆయన ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉందా?!
Comments
Please login to add a commentAdd a comment