National Security Guards
-
వీఐపీల భద్రతకు ఇక ‘ఎన్ఎస్జీ’ దూరం!
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) సిబ్బందిని అత్యంత ప్రముఖుల భద్రత విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ వీఐపీల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 1984లో ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరికి ప్రముఖుల భద్రత బాధ్యతలు లేవు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన దళంగా ఉండేది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అత్యంత ప్రముఖుల భద్రత బాధ్యతలో ఈ దళం ఉంది. ఇకపై వీరందరి భద్రత విధుల్లో నుంచి ఎన్ఎస్జీని తప్పించనున్నారు. వీరి భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారని ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇకపై ఎన్ఎస్జీ కమాండోలను ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నామని హోం శాఖ అధికారులు తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌కు ‘బ్లాక్ క్యాట్స్’!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనే భద్రతాబలగాలకు సహకరించేందుకు త్వరలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరించనున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఎన్కౌంటర్లతో పాటు ఉగ్రవాదులు పౌరుల్ని బందీలుగా చేసుకున్న సందర్భాల్లో ప్రాణనష్టం లేకుండా ఆపరేషన్‌ను పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందన్నారు. ఇళ్లలో నక్కిన ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో శిక్షణ పొందిన ఎన్ఎస్జీ కమెండోలు ఆపరేషన్‌లో పాల్గొంటే భద్రతా బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. -
లాలూ ప్రసాద్‌కు ‘జెడ్ ప్లస్’ అవసరమా ?!!
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను (దేశంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థ) కుదించి జెడ్ కేటగిరి భద్రతను కల్పించడం పట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన తండ్రికేమైనా హానీ జరిగితే మోదీ తోలు వలుస్తానని కూడా హెచ్చరించారు. తండ్రి ప్రాణాలకు ముప్పుందని తెలిసి, ఆయనకు కల్పించిన భద్రతను తొలగిస్తే ఎవరి కొడుకుకైనా రక్తం ఉడికిపోతుందంటూ కొడుకును లాలూ ప్రసాద్ యాదవ్ వెనకేసుకొచ్చారు. కాకపోతే ప్రధానంతటివారిని అంతటి మాట అనకుండా ఉండాల్సిందన్నారు. ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్’కు చెందిన సైనికులు, పోలీసులు ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అన్న పేరులోనే వారి విధులేమిటో మనకు స్పష్టం అవుతున్నాయి. భయంకరమైన టెర్రరిస్టుల నుంచిగానీ, విదేశీయుల నుంచిగానీ మన జాతికి, అంటే దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకు ఈ ఎన్ఎస్జీ ఏర్పాటయింది. 1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీలోని సైనికులకు కఠోరమైన శిక్షణ పొందిన వారు ఉంటారు. ఎల్తైన భవనాలను ఎక్కేందుకు, హెలికాప్టర్ల నుంచి తాళ్ల సహాయంతో దూకేందుకు, పారా జంపింగ్ తదితర ప్రత్యేక విద్యల్లో వీరికి కఠోరమైన శిక్షణ ఇస్తారు. ఈ ఎన్ఎస్జీ సైనికులను వాళ్లు వేసుకునే యూనిఫామ్‌ను బట్టి ‘బ్లాక్ క్యాట్స్’ అని కూడా పిలుస్తారు. వీరిలో స్పెషల్ యాక్షన్ గ్రూప్, స్పెషల్ రేంజర్ గ్రూప్ అని రెండు విభాగాలు ఉంటాయి. పది రోజుల క్రితమే ఎన్ఎస్జీకి చెందిన హవీల్దార్ గజేంద్ర సింగ్ బిస్త్‌కు ప్రతిష్టాకరమైన ‘అశోక చక్ర’ బిరుదును మరణానంతరం ప్రభుత్వం ఇచ్చింది. ముంబై నగరంపై టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు నారిమన్ హౌజ్ వద్ద పలువురు టెర్రరిస్టులను ప్రాణాలకు తెగించి గజేంద్ర సింగ్ నిలువరించారు. చివరకు టెర్రరిస్టుల గ్రెనేడ్ పేలుడులో మరణించారు. ఆ రోజున టెర్రరిస్టులను ఎదుర్కొనేందుకు ఎన్ఎస్జీ సైనికులు ప్రదర్శించిన నైపుణ్యం వారికి వచ్చిన నైపుణ్యంలో పది, పదిహేను శాతానికి మించి ఉండదని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మాజీ డీజీ టి. మడియాల్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రత్యేక శిక్షణ కలిగిన నైపుణ్యం సాధించిన ఎన్ఎస్జీ సైనికులను రాజకీయ నాయకుల భద్రతకు ఎందుకు కేటాయిస్తున్నారు? కేవలం ప్రతిష్టకోసమేనన్నది అందరికి తెల్సిందే. అందుకనే రాజకీయ నాయకుల భద్రత నుంచి తమవారి సంఖ్యను తగ్గించాల్సిందిగా ఎన్ఎస్జీ స్వయంగా కేంద్రానికి పిటిషన్ పెట్టుకొంది. ఆ పిటిషన్లో భాగంగానే లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పుడు వారి సెక్యూరిటీని తగ్గించారు. ఇది తప్పా? లాలూ ప్రసాద్ యాదవ్‌కు తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి అంతటి ముప్పు పొంచి ఉందా? ఎంతైన భవనాలు ఎక్కి, హెలికాప్టర్ల నుంచి దూకి, కొండల పైనుంచి పారా జంపింగ్‌లు చేసి ఆయన ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉందా?! -
హోం మంత్రి సీసీటీ సందర్శన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర హోం మంత్రి కేజే. జార్జ్ మంగళవారం నగరంలోని సెంటర్ ఫర్ కౌం టర్ టైజం (సీసీటీ)ను సందర్శించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరహాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఇక్కడ శిక్షణనిస్తారు. రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పని చేసే ఈ కేంద్రంలో గరుడ ఫోర్స్...ఉగ్రవాదులను పట్టుకునే నమూనా ప్రదర్శన ను నిర్వహించింది. ఉగ్రవాదులు మాటు వేసిన భవనాన్ని చుట్టు ముట్టడం, ఎవరినైనా కిడ్నాప్ చేసి ఉంటే విడిపించడం లాంటి కార్యాచరణను ప్రదర్శించి చూపారు. పోలీసు శాఖలోని కొందరిని ప్రత్యేకంగా ఎం పిక చేసి, మూడు నెలల పాటు ఇక్కడ శిక్షణనిస్తారు. అనంతరం గరుడ ఫోర్స్‌లో చేర్చుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రంలో రెండు వేల మందికి పైగా శిక్షణనిచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ బలగాన్ని వినియోగించుకుంటారు. మైసూరు దసరా, ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వినియోగించుకున్నారు. మేజర్ జనరల్ ముత్తన్న నేతృత్వంలో శిక్షణనిస్తున్నారు. తన సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఆయన వెంట అదనపు డీజీపీ అమర్ కుమార్ పాండే, ఐజీ సీమంత్ కుమార్ ఉన్నారు.