హోం మంత్రి సీసీటీ సందర్శన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర హోం మంత్రి కేజే. జార్జ్ మంగళవారం నగరంలోని సెంటర్ ఫర్ కౌం టర్ టైజం (సీసీటీ)ను సందర్శించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరహాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఇక్కడ శిక్షణనిస్తారు. రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పని చేసే ఈ కేంద్రంలో గరుడ ఫోర్స్...ఉగ్రవాదులను పట్టుకునే నమూనా ప్రదర్శన ను నిర్వహించింది. ఉగ్రవాదులు మాటు వేసిన భవనాన్ని చుట్టు ముట్టడం, ఎవరినైనా కిడ్నాప్ చేసి ఉంటే విడిపించడం లాంటి కార్యాచరణను ప్రదర్శించి చూపారు.
పోలీసు శాఖలోని కొందరిని ప్రత్యేకంగా ఎం పిక చేసి, మూడు నెలల పాటు ఇక్కడ శిక్షణనిస్తారు. అనంతరం గరుడ ఫోర్స్‌లో చేర్చుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రంలో రెండు వేల మందికి పైగా శిక్షణనిచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ బలగాన్ని వినియోగించుకుంటారు. మైసూరు దసరా, ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వినియోగించుకున్నారు. మేజర్ జనరల్ ముత్తన్న నేతృత్వంలో శిక్షణనిస్తున్నారు. తన సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఆయన వెంట అదనపు డీజీపీ అమర్ కుమార్ పాండే, ఐజీ సీమంత్ కుమార్ ఉన్నారు.