
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు.
మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు.
250 గుడిసెలు కూల్చివేత
టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్‌ఎస్‌వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు.