
జలీల్ ఇద్దరు కూతుళ్లు, పక్కనే బంధువుల అబ్బాయి
సాక్షి, మంగళూరు : తన కళ్ల ముందే తమ తండ్రిని పోలీసులు కాల్చి చంపారని జలీల్(42) కూతురు(14) పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో తమ తండ్రి పాల్గొనలేదని స్పష్టంచేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా గత శుక్రవారం మంగళూరు చెందిన దినసరి కూలి జలీల్(42) పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిరసనకారులను అదుపు చేసే క్రమంలో కాల్పులు జరిపామని, ఈ సందర్భంగా జలీల్ మృతి చెందారని పోలీసులు పేర్కొనగా.. తమ తండ్రికి సీఏఏ అంటేనే తెలియదని ఆయన కూతుళ్లు చెబుతున్నారు. ఆదివారం వారు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ తండ్రిని కళ్ల ముందే కాల్చి చంపేశారని వాపోయారు.
‘మేము రోజు మాదిరి పాఠశాలకు వెళ్లాం. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు నాన్న పాఠశాలకు వాచ్చాడు. మేమంతా ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ వచ్చి మా నాన్న ఎడమ కంట్లోకి దూకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందారని వైద్యులు తెలిపారు. మా కళ్ల ముందే మా నాన్న చనిపోయారు.. కాదు చంపేశారు’ అని జలీల్ పెద్ద కూతురు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు చెబుతున్నట్లు కాల్పులు జరిపిన చోట 7000 మంది లేరని ఆరోపించారు. దాదాపు 100 మంది మాత్రమే ఉన్నారని, వారిని కూడా పోలీసులు అదుపు చేయలేకపోయారని విమర్శించారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా పలువురు బుల్లెట్ల దాడిలో గాయాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు.
Comments
Please login to add a commentAdd a comment